Bipin Rawat: యోధుడా సెలవిక.. ముగిసిన రావత్‌ దంపతుల అంత్యక్రియలు

హెలికాప్టర్‌ ప్రమాదంలో కన్నుమూసిన భారత తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ దంపతులకు యావత్‌ దేశం కన్నీటి వీడ్కోలు పలికింది. శుక్రవారం

Updated : 10 Dec 2021 17:29 IST

దిల్లీ: హెలికాప్టర్‌ ప్రమాదంలో కన్నుమూసిన భారత తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ దంపతులకు యావత్‌ దేశం కన్నీటి వీడ్కోలు పలికింది. శుక్రవారం సాయంత్రం దిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలో బ్రార్‌ స్క్వేర్‌ శ్మశానవాటికలో రావత్‌, ఆయన సతీమణి మధులిక పార్థివదేహాలకు అంత్యక్రియలు పూర్తయ్యాయి. అధికారులు, ప్రముఖుల నివాళుల అనంతరం.. కుటుంబసభ్యులు అంతిమ సంస్కారాలు జరిపారు. రావత్‌ దంపతుల భౌతికకాయాలపై కప్పిన త్రివర్ణపతాకాన్ని.. కుమార్తెలకు అందజేశారు. 

సైనిక లాంఛనాల నడుమ అంత్యక్రియలు నిర్వహించారు. రావత్‌కు గౌరవసూచికంగా 17 శతఘ్నులను గాల్లోకి పేల్చి వందనం సమర్పించారు. సీడీఎస్‌ అంత్యక్రియల్లో 800 మంది సర్వీస్‌ సిబ్బంది పాల్గొన్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ దామి, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, డీఆర్‌డీఓ చీఫ్‌ జి. సతీశ్‌ రెడ్డి, పలువురు కేంద్రమంత్రులు, రాజకీయ ప్రముఖులు తదితరులు హాజరై తుది వీడ్కోలు పలికారు. 

ప్రముఖులు, సైనిక సిబ్బంది సందర్శనార్థం రావత్‌ దంపతుల భౌతికకాయాలను ఈ ఉదయం కామ్‌రాజ్‌ మార్గ్‌లోని ఆయన నివాసానికి తరలించారు. అక్కడ పలువురు కేంద్రమంత్రులు, రాజకీయ ప్రముఖులు వారికి నివాళులర్పించారు. అనంతరం కామ్‌రాజ్‌ మార్గ్‌ నుంచి బ్రార్‌ స్క్వేర్‌ శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర సాగింది. రెండు గంటల పాటు సాగిన ఈ అంతిమ యాత్రలో దారి పొడువునా ప్రజలు రావత్‌కు వీడ్కోలు పలికారు. ‘‘ఈ సూర్యుడు ఉన్నంతవరకు ఆయన పేరు నిలిచిపోతుంది.. రావత్‌ అమర్‌రహే’’ అంటూ శోకతప్త హృదయాలతో నినాదాలు చేశారు. 

రావత్‌ అంత్యక్రియల్లో పలు దేశాల సైనిక ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శ్రీలంక సీడీఎస్‌ అండ్‌ కమాండర్‌ జనరల్‌ షవేంద్ర సిల్వా, శ్రీలంక మాజీ అడ్మిరల్‌ రవీంద్ర చంద్రసిరి (నేషనల్‌ డిఫెన్స్‌ కాలేజ్‌లో రావత్‌కు మంచి మిత్రుడు), రాయల్‌ భూటాన్‌ ఆర్మీ డిప్యూటీ ఆపరేషన్స్‌ చీఫ్‌ బ్రిగేడియర్‌ డోర్జీ రించన్‌, నేపాల్‌ చీఫ్‌ ఆఫ్‌ జనరల్‌ స్టాఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ బాలకృష్ణ కార్కీ,  బంగ్లాదేశ్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ డివిజన్‌ స్టాఫ్‌ ఆఫీసర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ వకార్‌ ఉజ్‌ జమాన్‌, పలు దేశాల రాయబారులు హాజరై.. రావత్‌ పార్థివదేహం వద్ద నివాళులర్పించారు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని