Bipin Rawat: బిపిన్‌ రావత్‌.. వెల్లింగ్టన్‌లో లెక్చర్‌ ఇవ్వడానికి వెళ్లి..!

చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్‌ బుధవారం ఘోర ప్రమాదానికి గురైంది. తమిళనాడులోని కూనూరు సమీపంలో

Updated : 08 Dec 2021 18:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్‌ బుధవారం ఘోర ప్రమాదానికి గురైంది. తమిళనాడులోని కూనూరు సమీపంలో హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటివరకు సీడీఎస్‌ సహా  13 మంది దుర్మరణం చెందారు. ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.. కాగా.. వెల్లింగ్టన్‌లో మిలిటరీ కాలేజీలో లెక్చర్‌ ఇచ్చేందుకు ఈ ఉదయం 9 గంటలకు దిల్లీలోని ప్రత్యేక విమానంలో వెళ్లిన రావత్‌.. కొద్ది గంటలకే ఈ ప్రమాదానికి గురవడం బాధాకరం. 

* ఈ ఉదయం 9 గంటల ప్రాంతంలో జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఆయన సతీమణి మధులిక రావత్‌, ఆర్మీ ఉన్నతాధికారులు కలిసి ప్రత్యేక విమానంలో దిల్లీ నుంచి తమిళనాడు బయల్దేరారు. 

* ఈ విమానం ఉదయం 11.35 గంటలకు సూలూరు ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో ల్యాండ్‌ అయ్యింది.

* అక్కడి నుంచి వీరంతా ఎంఐ-17వీఎఫ్‌ హెలికాప్టర్‌లో వెల్లింగ్టన్‌కు బయల్దేరారు. వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్‌ సర్వీస్‌ కాలేజీలో లెక్చర్‌ ఇచ్చేందుకు రావత్‌ బయల్దేరారు. 

మార్గమధ్యంలో మధ్యాహ్నం 12.20 గంటల సమయంలో కట్టేరీలోని నంచప్ప చత్రం ప్రాంతంలో వీరు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ఒక్కసారిగా కూలిపోయింది. 

* అటవీ ప్రాంతంలో చెట్టుపై ఒక్కసారిగా కూలడంతో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో హెలికాప్టర్‌ నుంచి నలుగురు ప్రయాణికులు మండుతూ కిందపడిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

5 నిమిషాల్లో ల్యాండ్‌ అవ్వాల్సి ఉండగా..

ప్రమాదం జరిగిన ప్రాంతం వెల్లింగ్టన్‌ ఆర్మీ క్యాంప్‌కు కేవలం 16 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. మరో ఐదు నిమిషాల్లో ఆర్మీ క్యాంప్‌లో హెలికాప్టర్‌ ల్యాండ్‌ అవ్వాల్సి ఉండగా.. అంతలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని