కొవిషీల్డ్‌ టీకాకు గ్రీన్‌సిగ్నల్‌!

కరోనా మహమ్మారిని నిరోధించే వ్యాక్సిన్‌ ఎట్టకేలకు భారత్‌లోకి అందుబాటులోకి రానుంది. ఆక్సఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా భాగస్వామ్యంతో సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఉత్పత్తి చేసిన కొవిషీల్డ్‌ టీకాకు కేంద్ర ఔషధ ప్రమాణాల

Published : 01 Jan 2021 17:28 IST

అత్యవసర వినియోగానికి నిపుణుల కమిటీ సిఫార్సు!

భారత్‌ బయోటెక్‌ టీకాపై త్వరలోనే నిర్ణయం

దిల్లీ: కరోనా మహమ్మారిని నిరోధించే వ్యాక్సిన్‌ ఎట్టకేలకు భారత్‌లోకి అందుబాటులోకి రానుంది. ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా భాగస్వామ్యంతో సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఉత్పత్తి చేసిన కొవిషీల్డ్‌ టీకాకు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ నిపుణుల కమిటీ సమావేశంలో ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. కొవిషీల్డ్‌ టీకాను అత్యవసర వినయోగం కోసం ఆమోదించాలంటూ నిపుణుల కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. త్వరలోనే టీకా పంపిణీకి డీసీజీఐ అనుమతులిచ్చే అవకాశముంది. ఇక మరో సంస్థ భారత్‌ బయోటెక్‌ దరఖాస్తుపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.

ఆస్ట్రాజెనెకా.. ఏ గేమ్‌ ఛేంజర్‌

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ సహకారంతో ఆస్ట్రాజెనెకా ‘ఏజెడ్‌డీ1222’ (కొవిషీల్డ్‌) కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. అయితే, మూడో దశ ప్రయోగాలను రెండు విధాలుగా జరిపింది. ఒక విధానంలో రెండు డోసులను ఇచ్చి పరీక్షించిన ఆస్ట్రాజెనెకా, మరో విధానంలో ఒక పూర్తి డోసు, మరో అరడోసుతో ప్రయోగం జరిపింది. ఇందులో ఒకదానిలో 62 శాతం, మరో విధానంలో 90 శాతం సమర్థత సాధించినట్లు వెల్లడించింది. తాము అభివృద్ధిచేసిన వ్యాక్సిన్‌ సరాసరి 70 శాతం సమర్థత కలిగి ఉన్నట్లు మధ్యంతర విశ్లేషణ ఫలితాల్లో ఆక్స్‌ఫర్డ్ వెల్లడించింది. ఇక ఆసుపత్రుల్లో చేరే తీవ్రత ఉన్న కేసుల్లో వందశాతం రక్షణ కల్పిస్తుందని ఆస్ట్రాజెనెకా సీఈఓ పాస్కల్‌ సోరియట్‌ వెల్లడించారు.

సులభంగా టీకా నిల్వ

ఏదైనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన దాన్ని సరైన వాతావరణంలో నిల్వ చేయడమే అత్యంత ముఖ్యమైన అంశం. ఫైజర్‌ టీకాను నిల్వ చేయడానికి మైనస్‌ 70 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత అవసరమని తెలిసిందే. దీంతో ఆ టీకా నిల్వ, సరఫరా చాలా శ్రమ, ఖర్చుతో కూడుకున్నది. కానీ, ఆస్ట్రాజెనెకా టీకాను కేవలం సాధారణ రిఫ్రిజిరేటర్ల (2 నుంచి 8 డిగ్రీలు) ఉష్ణోగ్రత వద్వే నిల్వ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఉష్ణోగ్రత వద్ద దీన్ని ఆరు నెలలపాటు నిల్వ చేసుకోవచ్చని సంస్థ వెల్లడించింది. దీంతో మారుమూల ప్రాంతాలకు కూడా సులభంగా సరఫరా చేసే ఆస్కారం ఉంటుంది.

భారీస్థాయిలో ఉత్పత్తి..

టీకా వినియోగానికి అనుమతులు వచ్చిన వెంటనే భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు ఆస్ట్రాజెనెకా ఇప్పటికే ఏర్పాట్లు చేసుకొంది. ఇందుకోసం భారత్‌లోని సీరం ఇన్‌స్టిట్యూట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌లోనూ వీటిని సరఫరా చేసేందుకు వీలుగా దాదాపు 5 కోట్ల డోసులను ఇప్పటికే సిద్ధం చేసినట్లు సీరం ఇన్‌స్టిట్యూట్‌ వెల్లడించింది. 

తక్కువ ధర

కాగా.. ఇతర టీకాలతో పోలిస్తే కొవిషీల్డ్‌ తక్కువ ధరకే లభించనుంది. డోసుకు 3 డాలర్లు చొప్పున ప్రభుత్వానికి కొవిషీల్డ్‌ టీకాలు ఇవ్వనున్నట్లు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదార్‌ పూనావాలా ఇటీవల తెలిపారు. అంటే ఒక వ్యక్తికి రెండు డోసులకు కలిపి 6 డాలర్లు(దాదాపు రూ. 440) ఖర్చవుతుంది. అదే ప్రయివేటు మార్కెట్లో మాత్రం ఈ టీకా రూ. 700 నుంచి రూ. 800 వరకు ఉండనున్నట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని