అజిత్‌ డోభాల్ ఇంటి వద్ద వ్యక్తి హల్‌చల్‌ ఘటన.. ముగ్గురు కమాండోలపై వేటు

జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ డోభాల్‌ ఇంటి వద్ద భద్రతా లోపాలకు సంబంధించిన ఘటనలో ముగ్గురు కమాండోలపై వేటు పడింది.

Published : 18 Aug 2022 02:13 IST

దిల్లీ: జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ డోభాల్‌ ఇంటి వద్ద భద్రతా లోపాలకు సంబంధించిన ఘటనలో ముగ్గురు కమాండోలపై వేటు పడింది. డోభాల్‌ నివాసం వద్ద విధుల్లో ఉన్న ముగ్గురు కమాండోలను కేంద్రం ఉద్యోగం నుంచి తొలగించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇక, ఆయన భద్రతను పర్యవేక్షిస్తున్న డీఐజీ, కమాండెంట్‌ను మరో చోటుకు బదిలీ చేసినట్లు తెలిపాయి.

ఈ ఏడాది ఫిబ్రవరిలో డోభాల్‌ ఇంటి వద్ద ఓ వ్యక్తి హల్‌చల్‌ చేసిన విషయం తెలిసిందే. ఓ అపరిచిత వ్యక్తి కారుతో ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వాహనాన్ని అడ్డగించి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. ఘటన సమయంలో డోభాల్‌ ఇంట్లోనే ఉన్నారు. అనంతరం ఆ వ్యక్తిని విచారించగా.. తన శరీరంలో ఎవరో చిప్‌ పెట్టారని, వారే తనను కంట్రోల్‌ చేస్తున్నారని చెప్పాడు. అయితే ఎంఆర్‌ఐ స్కానింగ్‌ చేస్తే అతడి శరీరంలో ఎలాంటి చిప్‌ లేదని తేలింది. బెంగళూరుకు చెందిన ఆ వ్యక్తి అద్దె కారులో డోభాల్‌ ఇంటికి వచ్చాడని, అతడి మానసిక సరిగ్గా లేదని ప్రాథమిక విచారణలో గుర్తించారు. అనంతరం అతడిని అరెస్టు చేసి, దిల్లీ ప్రత్యేక పోలీసు విభాగానికి అప్పగించారు.

అయితే డోభాల్‌కు ఉగ్రవాదుల నుంచి ముప్పు ముంచి ఉన్నట్లు ఇప్పటికే పలుమార్లు నిఘా వర్గాలు హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సీరియస్‌ అయ్యింది. భద్రతలో లోపాలకు గానూ ముగ్గురు కమాండోలపై తాజాగా వేటు వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని