Updated : 24 Apr 2021 13:49 IST

మేం సేకరించిన టీకాలు రాష్ట్రాలకు ఉచితంగానే: కేంద్రం

దిల్లీ: తాము  సేకరించే కరోనా వ్యాక్సిన్లను అన్ని రాష్ట్రాలకు ఉచితంగానే ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. టీకా పంపిణీ విషయంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ లేవనెత్తిన అనుమానాలను కేంద్రం నివృత్తి చేసింది. ‘‘భారత్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెండు టీకాలను రూ. 150 చొప్పున కొనుగోలు చేస్తున్నాం. అలా సేకరించిన వ్యాక్సిన్లను రాష్ట్రాలకు ఉచితంగా అందిస్తున్నాం. ఇకపై కూడా అది కొనసాగుతుంది’’ అని కేంద్ర ఆరోగ్యశాఖ నేడు ట్వీట్‌ చేసింది.

కరోనా టీకా ధరలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జైరాం రమేశ్‌ ఇటీవల ఓ ట్వీట్‌ చేశారు. తాజా కొనుగోలు ఒప్పందం ప్రకారం.. సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్‌ టీకా ఒక్కో డోసును కేంద్రం రూ.400 కొనుగోలు చేయనున్నట్లు పేర్కొన్న ఓ పత్రిక కథనాన్ని జైరాం రమేశ్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఇది అమెరికా, యూకే, ఐరోపా సమాఖ్య, సౌదీ అరేబియా, బంగ్లాదేశ్‌, దక్షిణాఫ్రికా చెల్లిస్తున్న ధర కంటే ఎక్కువ అని పేర్కొన్నారు. భారత్‌లో తయారైన టీకాకు భారత్‌లోనే అత్యధిక ధర చెల్లించడం ఏంటని ప్రశ్నించారు. టీకా ఒక్కో డోసును రూ.150 చొప్పున విక్రయించినా తమకు లాభమే అని గతంలో సీరం ఇన్‌స్టిట్యూట్‌ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం వెంటనే ధరల్ని పునఃసమీక్షించాలని కోరారు. ఈ ట్వీట్‌కు కేంద్రం తాజాగా బదులిచ్చింది. తాము సేకరించే వ్యాక్సిన్లను రాష్ట్రాలకు ఉచితంగానే ఇస్తామని తెలిపింది.

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న వేళ కేంద్రం టీకా పంపిణీని వేగవంతం చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మే 1వ తేదీ నుంచి 18ఏళ్లు పైబడిన వారందరూ టీకా తీసుకోవచ్చని స్పష్టం చేసింది. అంతేగాక, వ్యాక్సిన్ల కొనుగోలులో రాష్ట్రాలకు స్వేచ్ఛ కల్పించింది. రాష్ట్రాలు, ప్రయివేటు కేంద్రాలు అదనపు డోసుల కోసం నేరుగా ఉత్పత్తిదారులను సంప్రదించొచ్చని తెలిపింది. టీకా తయారీదారులు తమ ఉత్పత్తిలో 50శాతం రాష్ట్రాలు, బహిరంగ మార్కెట్లో విక్రయించొచ్చని వెల్లడించింది. ఈ నేపథ్యంలో సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఇటీవల కొవిషీల్డ్‌ కొత్త ధరలకు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు డోసుకు రూ. 400, ప్రయివేటు ఆసుపత్రులకు డోసుకు రూ. 600 చొప్పున విక్రయించనున్నట్లు తెలిపింది. అయితే ఈ ధరలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఒకే దేశం ఒకే పన్ను అని చెబుతూ ఒకే దేశం రెండు వ్యాక్సిన్ల ధరలా అంటూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి.  


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని