Central govt: ఉద్యోగులు ఆలస్యంగా వస్తే కఠినచర్యలు: కేంద్రం

కార్యాలయానికి తరచూ ఆలస్యంగా వస్తూ.. నిర్ణీత పనివేళలు ముగియకముందే వెళ్లిపోతున్న ఉద్యోగుల విషయాన్ని ఇకపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించనుంది.

Published : 17 Jun 2024 07:08 IST

దిల్లీ: కార్యాలయానికి తరచూ ఆలస్యంగా వస్తూ.. నిర్ణీత పనివేళలు ముగియకముందే వెళ్లిపోతున్న ఉద్యోగుల విషయాన్ని ఇకపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించనుంది. ఇలాంటివారిపై సంబంధిత అధికారులు కఠినంగా వ్యవహరించాలని సిబ్బంది మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఆధార్‌తో అనుసంధానమైన బయోమెట్రిక్‌ వ్యవస్థలో పలువురు ఉద్యోగులు తమ హాజరు నమోదు చేయడం లేదని, మరికొందరు తరచూ ఆలస్యమవుతున్నారని గుర్తించినట్లు తెలిపింది. మొబైల్‌ ఫోన్‌ ఆధారిత ముఖ గుర్తింపు వ్యవస్థను వాడి ఉద్యోగులు ఎక్కడ ఉన్నారో గుర్తించగలిగేలా చేయవచ్చని సూచించింది. అన్ని విభాగాలు, శాఖలు, సంస్థలు తరచూ తమ ఉద్యోగుల హాజరు నివేదికల్ని పర్యవేక్షించాలని పేర్కొంది. ‘ఆలస్యంగా వచ్చిన ఒక్కోరోజుకు ఒకపూట సాధారణ సెలవు (సీఎల్‌) చొప్పున కోతపెట్టాలి. ఒకవేళ సీఎల్‌లు లేకపోతే ఆర్జిత సెలవుల నుంచి తగ్గించాలి. తగిన కారణాలు ఉన్నట్లయితే మాత్రం నెలలో గరిష్ఠంగా రెండుసార్లు, రోజుకు గంటకు మించకుండా ఆలస్యంగా రావడాన్ని క్షమించవచ్చు. ముందుగానే కార్యాలయం నుంచి వెళ్లిపోవడాన్నీ ఆలస్యంగా రావడంతో సమానంగానే చూడాలి’ అని తాజా ఉత్తర్వుల్లో తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని