Toolkit ట్వీట్లు: ఆ పదాన్ని తొలగించండి

కొవిడ్‌పై రాజకీయ వివాదానికి తెరలేపిన ‘కాంగ్రెస్‌ టూల్‌కిట్‌’ వ్యవహారంలో ప్రముఖ సోషల్‌మీడియా ట్విటర్‌పై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్‌ టూల్‌కిట్‌గా చెబుతూ చేసిన ట్వీట్లను

Published : 21 May 2021 18:24 IST

ట్విటర్‌పై కేంద్రం ధ్వజం

దిల్లీ: కొవిడ్‌పై రాజకీయ వివాదానికి తెరలేపిన ‘కాంగ్రెస్‌ టూల్‌కిట్‌’ వ్యవహారంలో ప్రముఖ సోషల్‌మీడియా ట్విటర్‌పై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్‌ టూల్‌కిట్‌గా చెబుతూ చేసిన ట్వీట్లను ‘మ్యానిపులేటెడ్‌ మీడియా’గా పేర్కొనడంపై మండిపడ్డ కేంద్రం.. ఆ పదాన్ని వెంటనే తొలగించాలని ట్విటర్‌ను ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 

దేశంలో కొవిడ్‌ పరిస్థితులపై కాంగ్రెస్‌ ప్రత్యేక టూల్‌కిట్‌ రూపొందించి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని భాజపా ఆరోపించిన విషయం తెలిసిందే. ఇటీవల ఆ పార్టీ నేత సంబిత్‌ పాత్రా కాంగ్రెస్‌ టూల్‌కిట్‌గా పేర్కొంటూ ట్వీట్ చేశారు. భాజపాకు చెందిన నేతలు కూడా దీన్ని రీట్వీట్‌ చేశారు. అయితే దీనిపై కాంగ్రెస్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ ట్వీట్లను తొలగించాలని డిమాండ్‌ చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ టూల్‌కిట్‌ అన్ని ఉన్న ట్వీట్ల కింద manipulated media అని ట్విటర్‌ నిన్న సాయంత్రం మార్క్‌ చేసింది. 

దీంతో స్పందించిన కేంద్రం.. ఆ పదాన్ని వెంటనే తొలగించాలని ట్విటర్‌ను ఆదేశించినట్లు తెలుస్తోంది. ‘‘ఈ వ్యవహారంపై విచారణ పెండింగ్‌లో ఉంది. సదరు సమాచారం నిజమా? కాదా? అన్నది చెప్పాల్సింది దర్యాప్తు సంస్థ. ట్విటర్‌ కాదు. దర్యాప్తు ప్రక్రియలో ట్విటర్‌ జోక్యం చేసుకోకూడదు. ఈ అంశంపై విచారణ జరుగుతుండగానే ట్విటర్‌ తీర్పు చెప్పకూడదు’’అని కేంద్రం హెచ్చరించినట్లు సదరు వర్గాల సమాచారం. ఆ పదాన్ని తొలగించాలని కేంద్రం ఆదేశించినట్లు తెలుస్తోంది.

ఏంటీ టూల్‌కిట్‌..

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కార్యకర్తలు చేపట్టాల్సిన చర్యలను వివరిస్తూ ఉన్న పత్రాలు సామాజిక మాధ్యమాల్లో వెలుగుచూశాయి. కాంగ్రెస్‌ గుర్తుతో ఉన్న ఆ పత్రాలను భాజపా అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా సహా పలువురు కమలదళ నేతలు సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. ప్రస్తుతం వ్యాపిస్తున్న కరోనా కొత్త రకం మ్యుటెంట్‌ను ‘ఇండియన్‌ స్ట్రెయిన్‌’ లేదా ‘మోదీ స్ట్రెయిన్‌’ అని పిలవాలని ఆ పత్రాల్లో ఉన్నట్లు భాజపా పేర్కొంది. ‘రాజకీయ లబ్ధి కోసం విదేశీ పాత్రికేయుల సాయంతో దేశ ప్రతిష్ఠను మంటగలపడానికి కాంగ్రెస్‌ ఏ అవకాశాన్నీ వదులుకోవట్లేదు. ఒక వ్యూహం ప్రకారమే కుంభమేళాను సూపర్‌ స్ప్రెడర్‌ కుంభ్‌గా పిలవాలని ఆ పార్టీ తన సామాజిక మాధ్యమ వాలంటీర్లకు పిలుపు నిచ్చింది’ అంటూ సంబిత్‌ పాత్రా ట్వీట్‌ చేశారు. భాజపా అధ్యక్షుడు నడ్డా ట్వీట్‌ చేస్తూ...‘సమాజాన్ని విభజించడం, ఇతరులపై విషం వెళ్లగక్కడం వంటి కళల్లో కాంగ్రెస్‌ పార్టీ ఆరితేరింది’ అని ఆరోపించారు. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ కూడా కాంగ్రెస్‌ను విమర్శిస్తూ ట్వీట్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని