Youtube: దేశ వ్యతిరేక కంటెంట్‌ వ్యాప్తి.. 35 యూట్యూబ్‌ ఛానెళ్లపై కేంద్రం వేటు

నకిలీ, భారత వ్యతిరేక కంటెంట్‌ను వ్యాప్తి చేస్తున్నాయనే ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా 35 యూట్యూబ్ ఛానెళ్లు, రెండేసి వెబ్‌సైట్లు, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌ ఖాతాలు, ఓ ఫేస్‌బుక్ అకౌంట్‌పై కొరడా ఝులిపించింది. వాటిని వెంటనే బ్లాక్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లు...

Updated : 22 Aug 2022 16:24 IST

దిల్లీ: నకిలీ, భారత వ్యతిరేక కంటెంట్‌ను వ్యాప్తి చేస్తున్నాయనే ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా 35 యూట్యూబ్ ఛానెళ్లపై వేటు వేసింది. రెండు వెబ్‌సైట్లు, రెండు ఇన్‌స్టాగ్రామ్, రెండు ట్విటర్‌ ఖాతాలు, ఓ ఫేస్‌బుక్ అకౌంట్‌పైనా కొరడా ఝులిపించింది. వాటిని వెంటనే బ్లాక్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర సమాచార, ప్రసారశాఖ వెల్లడించింది.

సంబంధిత శాఖ జాయింట్ సెక్రెటరీ విక్రమ్ సహాయ్ శుక్రవారం మాట్లాడుతూ.. ఈ ఛానెళ్లు, సామాజిక మాధ్యమాల అకౌంట్లు, వెబ్‌సైట్‌లను పాకిస్థాన్ నుంచి నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ యూట్యూబ్ ఛానెళ్లకు మొత్తం 1.20 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారని, వీటిలో అప్‌లోడ్ చేసిన వీడియోలకు 130 కోట్లకు పైగా వ్యూస్‌ ఉన్నాయని తెలిపారు. ఇంటెలిజెన్స్ వర్గాల తాజా సమాచారం ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

భారత సాయుధ దళాలు, జమ్మూ-కశ్మీర్, సీడీఎస్‌ జనరల్ బిపిన్ రావత్ మరణం తదితర సున్నిత అంశాలపై అవి విద్వేషపూరిత ప్రచారం చేస్తున్నాయని సహాయ్‌ వెల్లడించారు. గత నెలలోనూ పాకిస్థాన్‌కు చెందిన 20 యూట్యూబ్ ఛానెళ్లు, రెండు వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసినట్లు తెలిపారు. దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నేవారిపై ఎప్పటికప్పుడు కఠినంగా వ్యవహరిస్తామని సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే. యూట్యూబ్ కూడా ముందుకొచ్చి అటువంటి ఛానెళ్లను బ్లాక్ చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని