dengue cases: దిల్లీలో ‘డెంగీ’ డేంజర్‌ బెల్స్‌.. కేంద్రం హైఅలర్ట్‌

దేశ రాజధానిలో డెంగీ విజృంభిస్తోంది. విషజ్వరాలు దిల్లీని పట్టిపీడిస్తున్నాయి. గత ఐదేళ్లలో అత్యధిక డెంగీ మరణాలు ఈ సీజన్​లో నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.....

Published : 01 Nov 2021 22:40 IST

దిల్లీ: దేశ రాజధానిలో డెంగీ విజృంభిస్తోంది. విషజ్వరాలు దిల్లీని పట్టిపీడిస్తున్నాయి. గత ఐదేళ్లలో అత్యధిక డెంగీ మరణాలు ఈ సీజన్​లో నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. గడిచిన వారంలోనే 531 కొత్త కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 1,530కి చేరింది. ఇప్పటివరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం.. దిల్లీ సహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో విషజ్వరాల పరిస్థితిపై సమీక్ష నిర్వహించింది. ఈ నేపథ్యంలో పరీక్షలను వేగవంతం చేసేందుకు డెంగీ ఎన్ఎస్-1 ఎలీసా టెస్టింగ్ కిట్లను సమకూర్చుకోవాలని దిల్లీ ప్రభుత్వానికి కేంద్రం సూచించింది.

ఏర్పాటు కానున్న నిపుణుల బృందం

దిల్లీలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయనుంది. దేశవ్యాప్తంగా డెంగీ పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ‘దిల్లీ సహా ఇతర రాష్ట్రాల్లో డెంగీ కేసులను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోంది. దిల్లీ ప్రభుత్వంతో కలసి నిపుణుల బృందం ఓ ప్రణాళికను రూపొందిస్తోంది. డెంగీ వ్యాప్తి అధికంగా ఉన్న 200 జిల్లాలను గుర్తించి అక్కడికి బృందాలను పంపుతాం. పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాల నిర్వహణతో పాటు.. వేగంగా డెంగీ నిర్ధరణ పరీక్షలు జరుపుతాం’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. కేసుల పెరుగుదల నేపథ్యంలో దిల్లీలోని ప్రైవేట్ ఆసుపత్రులు డెంగీ రోగుల కోసం పడకల సంఖ్యను పెంచుతున్నాయి. వాయిదా వేయదగిన శస్త్రచికిత్సలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాయి.

పెరుగుతున్న పడకల సంఖ్యలు

డెంగీ విజృంభిస్తుండటంతో.. ఇప్పటివరకు కరోనా బాధితులకు కేటాయించిన పడకల్లో మూడో వంతు పడకలు డెంగీ రోగుల కోసం కేటాయించాలని కేజ్రీవాల్‌ సర్కారు కొద్దిరోజుల క్రితమే నిర్ణయించింది. డెంగీ, మలేరియా, చికన్‌గున్యా బాధితుల కోసం వీటిని వినియోగించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సూచించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న అన్ని ఆసుపత్రుల్లో డెంగీ రోగుల కోసం  తగినన్ని ఏర్పాట్లు చేశామని, ఏ రోగిని కూడా వెనక్కి పంపే అవసరం ఉండబోదని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని