Biometric Attendance: కేంద్ర ఉద్యోగులకు మళ్లీ బయోమెట్రిక్‌ హాజరు.. ఎప్పటినుంచంటే?

కరోనా ఉద్ధృతి సమయంలో తమ ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు కేంద్ర ప్రభుత్వం ఆయా చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. బయోమెట్రిక్‌ హాజరు విధానం నుంచి మినహాయింపు ఇందులో ఒకటి. అయితే.. ప్రస్తుతం పరిస్థితులు సాధారణానికి చేరుకుంటున్న నేపథ్యంలో దీన్ని...

Published : 01 Nov 2021 20:39 IST

దిల్లీ: కరోనా ఉద్ధృతి సమయంలో తమ ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. బయోమెట్రిక్‌ హాజరు విధానం నుంచి మినహాయింపు ఇందులో ఒకటి. అయితే.. ప్రస్తుతం పరిస్థితులు సాధారణానికి చేరుకుంటున్న నేపథ్యంలో దీన్ని మళ్లీ పునరుద్ధరించనున్నట్లు పేర్కొంది. నవంబర్ 8 నుంచి అన్ని స్థాయిల ఉద్యోగులు బయోమెట్రిక్ హాజరు వేయాలని సిబ్బంది వ్యవహారాల శాఖ సోమవారం ఓ ప్రకటన జారీ చేసింది. బయోమెట్రిక్ యంత్రాల పక్కన శానిటైజర్లను తప్పనిసరిగా ఉంచాలని, దీంతోపాటు ఉద్యోగులు హాజరుకు ముందు, తర్వాత తమ చేతులను విధిగా శుభ్రపరచుకునేలా చూసుకునే బాధ్యత విభాగాధిపతులదేనని స్పష్టం చేసింది.

అవసరమైతే అదనపు యంత్రాలు..

‘ఉద్యోగులందరూ హాజరు వేసేటప్పుడు తప్పనిసరిగా ఆరడుగుల భౌతిక దూరం పాటించాలి. విధిగా మాస్కు ధరించాలి. రద్దీని నివారించేందుకు అవసరమైతే అదనపు బయోమెట్రిక్ హాజరు యంత్రాలను ఏర్పాటు చేయొచ్చు’ అని సంబంధిత శాఖ అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలకు జారీ చేసిన తాజా ఆదేశాల్లో పేర్కొంది. మరోవైపు సమావేశాలను సాధ్యమైనంత వరకు వీడియో కాన్ఫరెన్స్‌ విధానంలోనే కొనసాగించాలని సూచించింది. ప్రజాప్రయోజనం ఉంటే తప్ప.. సందర్శకులతో వ్యక్తిగత సమావేశాలను నివారించాలని చెప్పింది. కార్యాలయాల్లో ఉన్నప్పుడు సిబ్బంది విధిగా కరోనా నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. మరోవైపు కొన్ని ఎంఎన్‌సీలు, ప్రైవేటు సంస్థలు సైతం ‘వర్క్‌ ఫ్రం హోం’లో ఉన్న తమ ఉద్యోగులకు క్రమంగా కార్యాలయాలకు రప్పిస్తున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని