
Mamata Banerjee: ప్రపంచ శాంతి సదస్సుకు దీదీకి అనుమతి నిరాకరణ
కోల్‌కతా: కేంద్ర ప్రభుత్వానికి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి మధ్య మరో వివాదం ఏర్పడింది. అక్టోబర్‌లో వాటికన్ సిటీలో నిర్వహించనున్న ‘ప్రపంచ శాంతి సదస్సు’లో పాల్గొనేందుకు మమతకు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అనుమతి నిరాకరించడం చర్చనీయాంశంగా మారింది.
మదర్ థెరిస్సా జీవితం, సేవాకార్యక్రమాలే ప్రధాన అంశంగా సాగనున్న ఈ సదస్సుకు జర్మనీ ఛాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్, పోప్ ఫ్రాన్సిస్, ఇటలీ ప్రధాని మారియో డ్రాగి తదితరులు హాజరుకానున్నారు. ఈ మేరకు మమతకు గతంలో రోమ్‌లోని కేథలిక్ అసోసియేషన్ నుంచి ఆహ్వానం అందింది. అనుమతుల నిరాకరణ వ్యవహారంపై టీఎంసీ అధికార ప్రతినిధి దేబాంగ్షు భట్టాచార్య దేవ్ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘దీదీ రోమ్ పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. గతంలో చైనా పర్యటనకూ అనుమతులు రద్దు చేశారు. అంతర్జాతీయ సంబంధాలు, భారత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మేం ఆ నిర్ణయాన్ని అంగీకరించాం. కానీ, ఇప్పుడు ఇటలీ కూడా ఎందుకు మోదీ జీ? బెంగాల్‌తో మీ సమస్య ఏంటి?’ అని ట్వీట్ చేశారు.