Biological-E:30కోట్ల డోసులకు కేంద్రం ఒప్పందం

దేశవ్యాప్తంగా రానున్న నెలల్లో విరివిరిగా కరోనా టీకాలు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.

Updated : 03 Jun 2021 12:00 IST

అందుబాటులోకి రానున్న రెండో దేశీయ టీకా

అడ్వాన్స్‌ కింద రూ.1,500కోట్లు చెల్లించనున్న కేంద్రం

దిల్లీ: రానున్న నెలల్లో దేశవ్యాప్తంగా విరివిరిగా కరోనా టీకాలు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. దానిలో భాగంగా హైదరాబాద్‌కు చెందిన ఔషధసంస్థ బయోలాజికల్ ఇ.లిమిటెడ్(బిఇ) నుంచి 30కోట్ల టీకా డోసుల కోసం గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ ముందుస్తు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఆ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం రూ.1,500కోట్లు అడ్వాన్స్‌గా అందించనుంది. అలాగే ఈ ఔషధ సంస్థ ఈ ఏడాది ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య టీకా డోసులను తయారు చేసి, నిల్వ చేస్తుందని ఆరోగ్య శాఖ ప్రకటన వెల్లడించింది. రాబోయే నెలల్లో అవి అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. కొవాగ్జిన్ తరవాత అందుబాటులోకి రానున్న మరో దేశీయ టీకా ఇది.

బయోలాజికల్ ఇ అభివృద్ధి చేసిన కరోనా టీకా మొదటి రెండు దశల్లో మెరుగైన ఫలితాలు చూపగా.. ప్రస్తుతం మూడో దశ క్లినికల్ పరీక్షలు జరుపుకుంటోంది. అమెరికాకు చెందిన బేలార్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌తో కలిసి ఈ సంస్థ కొవిడ్‌ టీకాను అభివృద్ధి చేసింది. దానిలో భాగంగా మూడో దశ ట్రయల్స్ నిమిత్తం నెల క్రితం సెంట్రల్ డ్రగ్స్ అండ్‌ స్టాండర్డ్స్‌ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్‌ఈఓ) అనుమతి పొందింది. పరిశోధన, అభివృద్ధి, వ్యయపరంగా సహాయం అందించి స్వదేశీ టీకాలను ప్రోత్సహించేందుకు చేస్తోన్న ప్రయత్నాల్లో భాగమే ఈ ఒప్పందమని ఈ సందర్భంగా మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే ఆర్థిక సాయం కోసం బయోటెక్నాలజీ విభాగం ఔషధ సంస్థకు రూ.100కోట్లు అందించిందని వెల్లడించింది. పలు అధ్యయనాల నిమిత్తం ఈ రెండింటి మధ్య ఒప్పందం ఉంది. 

మరోపక్క జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేసిన టీకాను మనదేశంలో ఉత్పత్తి చేయడానికీ బయోలాజికల్ ఇ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. కెనడా సంస్థ ప్రావిడెన్స్ థెరప్యూటిక్స్‌కు చెందిన ఎంఆర్‌ఎన్‌ఏ టీకాను మనదేశానికి తీసుకురావడానికి, ఆ టీకాను ఇక్కడ ఉత్పత్తి చేయడానికి కూడా ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం ఈ సంస్థ ఉత్పత్తి ప్రణాళికలకు అనుగుణంగా అవసరమైన నిధులను సమకూర్చుకునే పనిలో ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని