రెమిడెసివిర్‌ ఔషధ ఉత్పత్తిని పెంచండి!

కొవిడ్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న రోగులకు ఇచ్చే రెమిడెసివిర్‌ ఔషధ ఉత్పత్తిని పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఫార్మా సంస్థలను ఆదేశించింది. వీటిని నెలకు 80 లక్షల వయల్స్‌ ఉత్పత్తి చేయడంతో పాటు ధర కూడా రూ.3500కు తగ్గించాలని స్పష్టం చేసింది.

Updated : 15 Apr 2021 13:48 IST

ఫార్మా సంస్థలకు కేంద్రం ఆదేశం

దిల్లీ: కొవిడ్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న రోగులకు ఇచ్చే రెమిడెసివిర్‌ ఔషధ ఉత్పత్తిని పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఫార్మా సంస్థలను ఆదేశించింది. వీటిని నెలకు 80 లక్షల వయల్స్‌ ఉత్పత్తి చేయడంతో పాటు ధర కూడా రూ.3500కు తగ్గించాలని స్పష్టం చేసింది. దేశంలో కొవిడ్‌ విస్తృతి పెరగడం, ఆసుపత్రుల్లో చేరికలు ఎక్కువవుతోన్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇక దేశంలో కొవిడ్‌ తీవ్రత అదుపులోకి వచ్చే వరకు రెమిడెసివిర్‌ను ఎగుమతి చేయవద్దని రెండు రోజుల కింద ఫార్మా సంస్థలకు స్పష్టం చేసింది.

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోన్న వేళ.. పలు రాష్ట్రాల్లో రెమిడెసివిర్‌ ఔషధ కొరత ఏర్పడుతోందనే వార్తలు వస్తున్నాయి. దాంతో ఆ ఔషధాన్ని తయారు చేసే ఫార్మా సంస్థలతో కేంద్ర ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. ప్రస్తుతం దేశంలో నెలకు 38.80 లక్షల వయల్స్‌ ఉత్పత్తి అవుతుండగా, వీటిని 80 లక్షల వయల్స్‌కు పెంచేందుకు అనుమతి ఇచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి మన్‌సుఖ్‌ ఎల్‌.మాండవ్య వెల్లడించారు. దేశంలో ఔషధ వినియోగానికి ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ఎగుమతిపై కొంతకాలం నిషేధం విధించామన్నారు. వీటితో పాటు ధరను కూడా రూ.3500 తగ్గించేందుకు తయారీ సంస్థలు సమ్మతించాయని, వారాంతానికి ఈ ధరలు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు.

ప్రస్తుతం దేశంలో నెలకొన్న అత్యవసర పరిస్థితుల దృష్ట్యా తొలుత ఆసుపత్రులు, వివిధ వైద్య కేంద్రాలకు రెమిడెసివిర్‌ను సరఫరా చేయాలని ఫార్మా సంస్థలకు ఆయన సూచించారు. ఇక ఆ ఔషధాన్ని బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయించేవారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) సూచించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని