oxygen: కేంద్రానికి సుప్రీంలో మరో ఎదురుదెబ్బ!

దేశంలో ఆక్సిజన్‌ కోసం కేంద్రానికి, రాష్ట్రాలకు విభేదాలు తలెత్తుతున్నాయి. ఈ విషయంలో కోర్టులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రాజధాని దిల్లీకి ప్రతిరోజూ 700 మెట్రిక్‌ టన్నుల మెడికల్‌ ఆక్సిజన్‌ను సరఫరా చేయాలని ఆదేశించిన సుప్రీం తాజాగా కర్ణాటక విషయంలోనూ అదే విధంగా స్పందించింది. కర్ణాటకకు ప్రాణవాయు సరఫరాను పెంచాలంటూ...

Updated : 07 May 2021 18:48 IST

దిల్లీ: దేశంలో ఆక్సిజన్‌ కోసం కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. ఈ విషయంలో కోర్టులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రాజధాని దిల్లీకి ప్రతిరోజూ 700 మెట్రిక్‌ టన్నుల మెడికల్‌ ఆక్సిజన్‌ను సరఫరా చేయాలని ఆదేశించిన సుప్రీం తాజాగా కర్ణాటక విషయంలోనూ అదే విధంగా స్పందించింది. కర్ణాటకకు ప్రాణవాయు సరఫరాను పెంచాలంటూ ఆ రాష్ట్ర హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సమర్థించింది. ‘కర్ణాటక ప్రజలను చూస్తూ అలా వదిలేయలేం’అని వ్యాఖ్యానించింది.

కర్ణాటకలో కొవిడ్‌ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి 1,200 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేయాల్సిందిగా ఆ రాష్ట్ర హైకోర్టు గురువారం కేంద్రాన్ని ఆదేశించింది. దీనిపై కేంద్రం సుప్రీంకోర్టుకు వెళ్లింది. కర్ణాటక కోర్టు ఆదేశాలను తక్షణమే నిలుపుదల చేయాలని కోరింది. దీనిపై  ఇవాళ జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలో అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. కర్ణాకటకు ఇప్పటికే  965 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేస్తున్నామని న్యాయస్థానానికి తెలిపారు. ఇదే విధంగా అన్ని రాష్ట్రాల హైకోర్టులు కేంద్రాన్ని ఆదేశిస్తూ పోతే ఆక్సిజన్‌ సరఫరా ప్రక్రియ క్లిష్టంగా మారుతుందన్నారు. మద్రాస్‌, తెలంగాణ హైకోర్టులు కూడా ఇదే అంశాన్ని లేవనెత్తుతున్నాయని సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు. తక్కువ మొత్తంలో ఆక్సిజన్‌ నిల్వలు ఉండటం మూలంగా అందరూ సమన్వయం చేసుకోవాలని కోరారు. కర్ణాటకలో ఆక్సిజన్‌ సమస్యను తీర్చేందుకు కేంద్రం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు.

దీనిపై జస్టిస్‌ చంద్రచూడ్‌ మాట్లాడుతూ.. కర్ణాటకలో ప్రస్తుతం 3.95 లక్షల కేసులు ఉన్నప్పటికీ  ఆ రాష్ట్రం 1,700 టన్నుల ఆక్సిన్‌ మాత్రమే అడుగుతోందని, కనీసం అసరాలకు 1,100 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అవసరమవుతుందని అన్నారు. ఈ విషయంలో రాష్ట్రానికి 1,200 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ సరఫరా చేయాలన్న కర్ణాటక హైకోర్టు ఆదేశాలను జస్టిస్‌ చంద్రచూడ్‌ సమర్థించారు. దీంతో ఇప్పటికే దిల్లీకి ఆక్సిజన్‌ సరఫరా విషయంలో సుప్రీంతో చీవాట్లు తిన్న కేంద్రానికి కర్ణాటక విషయంలోనూ ఎదురుదెబ్బే తగిలినట్లయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని