Ajay Mishra: కుమారుడిపై హత్య అభియోగాలు.. అజయ్‌ మిశ్రపై చర్యలు ఉండవట..!

లఖింపుర్‌ ఖేరీ ఘటన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రను పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి

Updated : 16 Dec 2021 18:28 IST

దిల్లీ: లఖింపుర్‌ ఖేరీ ఘటన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రను పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం గానీ, భాజపా అధిష్ఠానం గానీ ఆయనపై చర్యలు తీసుకునే అవకాశాలు కన్పించట్లేదని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. 

లఖింపుర్‌ ఖేరీ ఘటన ప్రణాళిక ప్రకారం జరిగిందేనని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఇటీవల నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఇదే తుది నివేదిక కాదని, దీనిపై మరింత దర్యాప్తు జరగాల్సి ఉందని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. అంతేగాక, ఈ వ్యవహారంలో అజయ్‌ మిశ్ర కుమారుడు ఆశిష్‌పైనే ఆరోపణలు ఉన్నందున ఇప్పటికిప్పుడు కేంద్రమంత్రిపై చర్యలు తీసుకోడానికి ప్రభుత్వం సుముఖంగా లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. 

ఇదిలా ఉండగా.. కొందరు విలేకరులపై అజయ్‌ మిశ్ర మండిపడ్డ వీడియో ఒకటి నిన్న వైరల్‌గా మారింది. బుధవారం లఖింపుర్‌ ఖేరీ జిల్లాలో ఓ ఆసుపత్రిని సందర్శించి బయటకు వస్తున్న అజయ్‌ మిశ్రను విలేకరులు చుట్టుముట్టారు. సిట్‌ వెల్లడించిన అంశాల గురించి, ఆశిష్‌ మిశ్రపై నమోదైన హత్యాయత్న అభియోగాల గురించి ప్రశ్నించారు. దీంతో సహనం కోల్పోయిన అజయ్‌.. వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాపై దుర్భాషలాడారు. ఈ ఘటన జరిగిన కొద్ది గంటల తర్వాత అజయ్‌ తక్షణమే దిల్లీ బయలుదేరి రావాలని కేంద్ర పెద్దల నుంచి కబురు అందినట్లు వార్తలు వచ్చాయి. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో కేంద్రం అజయ్‌పై తీవ్రచర్యలు తీసుకునే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు లఖింపుర్‌ ఘటనపై పార్లమెంట్ ఉభయసభల్లోనూ ఆందోళనలు వెల్లువెత్తాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని