Framers Protest: తక్షణమే కేసులు ఎత్తేస్తాం.. ఉద్యమ రైతులకు కేంద్రం కొత్త ఆఫర్‌

దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో ఏడాది కాలంగా ఆందోళన సాగిస్తున్న రైతులు తమ ఉద్యమాన్ని విరమించేలా కేంద్ర ప్రభుత్వం మరో ఆఫర్‌ ఇచ్చింది. ఉద్యమంలో

Updated : 08 Dec 2021 14:56 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో ఏడాది కాలంగా ఆందోళన సాగిస్తున్న రైతులు తమ ఉద్యమాన్ని విరమించేలా కేంద్ర ప్రభుత్వం మరో ఆఫర్‌ ఇచ్చింది. ఉద్యమంలో పాల్గొన్న రైతులపై పెట్టిన పోలీసు కేసులను తక్షణమే ఎత్తేస్తామని తెలిపింది. ఈ మేరకు బుధవారం మరో ప్రతిపాదన పంపినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 

రైతు సంఘాలకు మంగళవారం కేంద్రం కొన్ని ప్రతిపాదనలు పంపింది. కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) చట్టబద్ధతపై కమిటీని ఏర్పాటు చేస్తామని, ఇందులో రైతు సంఘాల నేతలు కూడా ఉంటారని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది. రైతులపై నమోదైన కేసులను కూడా ఉపసంహరించుకుంటామని, అయితే అంతకంటే ముందు అన్నదాతలు తమ ఉద్యమాన్ని విరమించాలని సూచించింది. ఈ ప్రతిపాదనలపై సంయుక్త కిసాన్‌ మోర్చాకు చెందిన ఐదుగురు సభ్యుల కమిటీ నేడు సమావేశమైంది. 

అయితే ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్‌లో కొన్ని లోపాలున్నాయని, ఆందోళన విరమించిన తర్వాత కేసులు వెనక్కి తీసుకుంటామని చెప్పడం ఆమోదయోగ్యం కాదని ఆ కమిటీ తీర్మానించింది. ప్రభుత్వ ప్రతిపాదలను వెనక్కి పంపింది. దీంతో కేంద్రం.. వాటిని సవరించి మళ్లీ కొత్త ఆఫర్‌ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. కొత్త ప్రతిపాదనపై రైతు సంఘాల కమిటీ మరోసారి సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో సింఘ సరిహద్దులో ఉద్యమకారులతో సంయుక్త కిసాన్‌ మోర్చా నేతలు భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఆందోళన విరమణపై కూడా నేడు నిర్ణయం తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని