Corona: 6 రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు

దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతి తగ్గుముఖం పడుతున్న సమయంలో కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటం ఆందోళనకరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం

Published : 02 Jul 2021 14:41 IST

ఉన్నతస్థాయి బృందాలను పంపిన కేంద్రం

దిల్లీ: దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతి తగ్గుముఖం పడుతున్న సమయంలో కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటం ఆందోళనకరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం.. ఆయా రాష్ట్రాలకు బృందాలను పంపింది. అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి నివేదిక అందజేయాలని సూచించింది.

కేరళ, అరుణాచల్‌ ప్రదేశ్‌, త్రిపుర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, మణిపూర్‌ రాష్ట్రాల్లో గత కొన్ని రోజుల్లో కొవిడ్‌ కొత్త కేసుల్లో పెరుగుదల కన్పిస్తోంది. దీంతో ఈ రాష్ట్రాలకు కేంద్రం ఇద్దరు సభ్యుల చొప్పున ఉన్నతస్థాయి బృందాలను పంపించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. ఈ బృందాలు తక్షణమే రాష్ట్రాలకు వెళ్లి అక్కడి కొవిడ్‌ పరిస్థితులు, వైరస్‌ నిర్వహణ చర్యలను పరిశీలిస్తాయని పేర్కొంది. ఈ రాష్ట్రాల్లో టెస్టింగ్, ట్రాకింగ్‌, కంటైన్మెంట్‌ చర్యలు, కొవిడ్‌ నిబంధనల అమలు, ఆసుపత్రుల్లో పడకల లభ్యత, అంబులెన్సులు, వెంటిలేటర్లు, మెడికల్‌ ఆక్సిజన్‌, కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ తదితర అంశాలను కేంద్ర బృందాలు సమీక్షించి.. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వాలకు పలు సూచనలు చేస్తాయని తెలిపింది. 

ఏప్రిల్‌ - మే నెలలో తీవ్రంగా విజృంభించిన కరోనా.. ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టింది. గత కొద్ది రోజులుగా కొత్త కేసుల సంఖ్య 50వేలకు దిగువనే ఉంటోంది. అయితే ఇటీవల 40వేల దిగువకు పడిపోయిన కేసులు.. మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా దేశంలో 46వేలకు పైగా కొత్త కేసులు నమోదుగా.. ఒక్క కేరళలోనే దాదాపు 13వేల కేసులు బయటపడ్డాయి. అక్కడ మరణాల సంఖ్య కూడా 100పైనే ఉంది. మరోవైపు దేశంలో ఇప్పటివరకూ 4లక్షలమంది కరోనాకు బలయ్యారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని