Lumpy Skin: లంపీ స్కిన్‌ వ్యాధితో 67వేల పశువుల మృత్యువాత

లంపీస్కిన్‌ వ్యాధి వల్ల జులై నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 67వేల మూగజీవాలు ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Updated : 12 Sep 2022 23:02 IST

దేశీయ టీకా త్వరలోనే రానుందన్న ప్రధాని మోదీ

దిల్లీ: గతకొన్ని రోజులుగా పలు రాష్ట్రాల్లోని పశువులను లంపీచర్మ వ్యాధి ( Lumpy Skin Disease) పీడిస్తోంది. జులై నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 67వేల మూగజీవాలు ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఎనిమిది రాష్ట్రాల్లో వ్యాధి తీవ్రత ప్రబలంగా ఉందని.. ఆయా రాష్ట్రాల్లో పశువులకు వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా చేపడుతున్నామని తెలిపింది. వ్యాధిని నియంత్రించేందుకు ప్రస్తుతం గోట్‌పాక్స్‌ (Goat pox) వ్యాక్సిన్‌ అందిస్తున్నామని.. దేశీయంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ మరికొన్ని రోజుల్లోనే అందుబాటులోకి రానుందని పేర్కొంది.

దేశంలోని పశువులను లంపీ స్కిన్‌ (Lumpy Skin) వేధిస్తోన్న వేళ.. వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని పశుసంవర్ధక శాఖ కార్యదర్శి జతింద్రనాథ్‌ స్వెయిన్‌ వెల్లడించారు. ఇందులో భాగంగా కేంద్ర వ్యవసాయ పరిశోధనా విభాగం ఐసీఏఆర్‌కు చెందిన రెండు సంస్థలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ (Lumpi-ProVacInd) వచ్చే మూడు, నాలుగు నెలల్లోనే మార్కెట్‌లోకి వస్తుందన్నారు. ప్రస్తుతం ఈ వ్యాధి తీవ్రత గుజరాత్‌, రాజస్థాన్‌, పంజాబ్‌, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, మధ్య ప్రదేశ్‌, జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రాల్లో అధికంగా ఉందని.. ఆంధ్రప్రదేశ్‌, అండమాన్‌ నికోబార్‌లలోనూ కొన్నిచోట్ల ఈ వ్యాధి కేసులు ఉన్నాయన్నారు.

రాజస్థాన్‌లో నిత్యం ఏడు, ఎనిమిది వందల పశువులు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో మాత్రం ఈ సంఖ్య రోజుకు వందకు దిగువలోనే ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు పేర్కొంటున్నాయి. దేశంలో మొత్తం 20కోట్ల పశువులు ఉన్నాయన్న జతింద్రనాథ్‌ స్వెయిన్‌.. ఇప్పటివకే వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాల్లో 1.5కోట్ల డోసులను పంపిణీ చేశామని తెలిపారు. లంపీస్కిన్‌ వ్యాధి నివారణకు తయారు చేసిన Lumpi-ProVacInd వ్యాక్సిన్‌ డీసీజీఐ అనుమతి రావాల్సి ఉందని.. వచ్చే మూడు, నాలుగు నెలల్లో వాణిజ్య అనుమతులు వచ్చే అవకాశముందన్నారు.

మరోవైపు దేశవ్యాప్తంగా పశువుల్లో వ్యాపిస్తోన్న ఈ లంపీస్కిన్‌ వ్యాధి వల్ల రైతులు, వారి ఆదాయంపై ప్రభావం పడుతోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వ్యాధి వ్యాప్తిని నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. దేశీయంగా తయారు చేసిన వ్యాక్సిన్‌ త్వరలోనే అందుబాటులోకి వస్తుందన్న ఆయన.. 2025 నాటికి వందశాతం పశువులకు టీకా అందిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని