All-party meet: రేపే అఖిలపక్ష సమావేశం.. 40 పార్టీలకు కేంద్రం ఆహ్వానం

జి-20 సదస్సుకు సంబంధించి చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సోమవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనుంది. దీనికి 40 పార్టీలకు ఆహ్వానం పంపింది.

Published : 04 Dec 2022 11:45 IST

దిల్లీ: వచ్చే ఏడాది సెప్టెంబరులో భారత్‌ ఆతిథ్యం ఇవ్వనున్న జి-20 సదస్సుకు సంబంధించి సూచనలు, సలహాలు, చర్చలు, వ్యూహాలను ఖరారు చేసేందుకు కేంద్రం సోమవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే ఈ సమావేశానికి దాదాపు 40 పార్టీల అధ్యక్షులను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది.

భారతదేశం అధికారికంగా డిసెంబర్ 1న జి-20 అధ్యక్ష బాధ్యతలు స్వీకరించింది. ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా 200 సమావేశాలను నిర్వహించనుంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 9, 10 తేదీల్లో దిల్లీలో జి-20 సదస్సు జరగనుంది. దీనికి సభ్యదేశాల దేశాధినేతలు లేదా ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సదస్సు నిర్వహణపై దేశంలోని పలు ప్రాంతాల్లో కేంద్రం సమావేశాలు ఏర్పాటు చేయనుంది. 

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ అఖిలపక్ష సమావేశంలో పాల్గొననున్నారు. ఆదివారం సాయంత్రం ఆమె దిల్లీ చేరుకోనున్నారు. అయితే తాను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా కాకుండా తృణమూల్ కాంగ్రెస్ చైర్‌పర్సన్ హోదాలో ఈ సమావేశంలో పాల్గొంటానని మమత చెప్పారు.

ఇండోనేషియా ఈ నెల 1న బాలిలో జరిగిన సదస్సులో జి-20 అధ్యక్ష బాధ్యతల్ని భారత్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. ఇది ప్రతి భారతీయ పౌరుడికి గర్వకారణమని ప్రధాని మోదీ ఇటీవల పేర్కొన్నారు. జి-20 లేదా ‘గ్రూప్ ఆఫ్ 20’ అనేది ప్రపంచంలోని ప్రధాన అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల ఉమ్మడి వేదిక. ఇందులో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యూకే, యూఎస్‌, యూరోపియన్ యూనియన్ సభ్యదేశాలుగా ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని