Budget 2023: ఆ స్కూళ్లలో 38,800 ఉద్యోగాలు: కేంద్రం

దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్‌ స్కూళ్లలో భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్టు కేంద్రం వెల్లడించింది. 

Published : 01 Feb 2023 16:24 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో(Eklavya Model Residential Schools) భారీ సంఖ్యలో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు చేపట్టనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ 2023-24(Union Budget 2023-24)లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో 38,800 ఉపాధ్యాయ, సహాయక సిబ్బంది ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. వచ్చే మూడేళ్లలో దేశంలోని 740 ఏకలవ్య మోడల్‌ రెసిడెన్సియల్‌ పాఠశాలల్లో 3.5లక్షల మంది ఆదివాసీ విద్యార్థులకు విద్యాబోధన అందించడమే లక్ష్యంగా ఈ భారీ రిక్రూట్‌మెంట్‌ చేపట్టనున్నట్టు వివరించారు.

ప్రస్తుతం కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా 689 ఏకలవ్య పాఠశాలలు ఉన్నాయి. ఆదివాసీల సామాజిక, ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరిచే ఉద్దేశంతో కొత్త పథకాన్ని నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో ప్రతిపాదించారు. రూ.15వేల కోట్లతో పీఎం-పీవీటీజీ డెవలప్‌మెంట్‌ మిషన్‌ను మూడేళ్లలో అమలు చేస్తామని తెలిపారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ఆదివాసీ కుటుంబాలు, సమూహాలకు కనీస సదుపాయాలైన ఇళ్ల నిర్మాణం, సురక్షితమైన తాగునీరు, మరుగుదొడ్లు, ఆరోగ్యం, విద్య, పౌష్టికాహారం, రోడ్లు, టెలిఫోన్‌ కనెక్టివిటీ వంటి సౌకర్యాలను కల్పించడమే తమ లక్ష్యమన్నారు. మరోవైపు, దేశంలో కొత్తగా మరో 157 కొత్త నర్సింగ్‌ కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్టు నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని