
Border Dispute: ఉపగ్రహ ఛాయచిత్రాలతో ఈశాన్య రాష్ట్రాల సరిహద్దులు
దిల్లీ: అసోం-మిజోరం మధ్య సరిహద్దు వివాదం హింసాత్మకంగా మారి ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వివాదాలను పరిష్కారించేందుకు గాను ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా ఈశాన్య రాష్ట్రాల సరిహద్దులను ఖరారు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సరిహద్దుల ఖరారు బాధ్యతలను నార్త్ ఈస్ట్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ (ఎన్ఈఎస్ఏసీ), డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, నార్త్ ఈస్ట్ కౌన్సిల్‌కు అప్పగించినట్లు కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు వెల్లడించారు. ఉపగ్రహ చిత్రాల ద్వారా ఈశాన్య రాష్ట్రాల సరిహద్దులను ఖరారుచేసే ఆలోచనకు కొన్నినెలల క్రితమే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆమోదముద్ర వేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
షిల్లాంగ్ కేంద్రంగా పనిచేస్తున్న నార్త్ ఈస్ట్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ వరద నిర్వహణ కోసం ఇప్పటికే అంతరిక్ష సాంకేతికతను ఉపయోగిస్తోంది. సరిహద్దుల నిర్ధారణకు శాస్త్రీయ పద్ధతులు అందుబాటులోకి వస్తే వ్యత్యాసాలకు తావు లేకుండా ఉండటమే కాకుండా అన్నిరాష్ట్రాలు ఆమోదించే అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
ఏళ్లుగా అస్సాం, మిజోరం సరిహద్దు వివాదం సద్దుమణగడం లేదు. ఈనెల 20న మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అస్సాంలోని కాచర్ జిల్లా, మిజోరంలోని కోలాసిబ్ జిల్లాల మధ్య ఉన్న సరిహద్దు వద్ద స్థానికులు, భద్రతాసిబ్బంది మధ్య ఘర్షణ హింసకు దారితీసింది. ఈ నేపథ్యంలో కొందరు కాల్పులు జరపడంతో అస్సాంకు చెందిన ఏడుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య మాటల తూటాలు పేలాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.