Sedition Law: రాజద్రోహం కేసు.. కేంద్రం యూటర్న్‌..!

బ్రిటిష్‌ కాలం నాటి రాజద్రోహం చట్టాన్ని సమర్థిస్తూ రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా యూటర్న్‌ తీసుకుంది.

Updated : 09 May 2022 19:57 IST

మొన్న సమర్థించి.. నేడు పరిశీలిస్తామన్న ప్రభుత్వం

సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ దాఖలు

దిల్లీ: బ్రిటిష్‌ కాలం నాటి రాజద్రోహం చట్టాన్ని సమర్థిస్తూ రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా యూటర్న్‌ తీసుకుంది. ఈ చట్టాన్ని పునః పరిశీలించాలనుకుంటున్నట్లు సోమవారం సర్వోన్నత న్యాయస్థానానికి తెలియజేసింది. ఈ మేరకు నేడు కొత్త అఫిడవిట్‌ను కోర్టుకు సమర్పించింది.

‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ స్ఫూర్తి, ప్రధాని మోదీ దృక్పథంతో రాజద్రోహం చట్టంలోని 124ఏ సెక్షన్‌ నిబంధనలను పునః పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పరిశీలనలను కేవలం అధికారిక ఫోరమ్‌ మాత్రమే చేయగలదు. అందువల్ల ఈ ప్రక్రియ ముగిసేంత వరకు న్యాయస్థానం వేచి ఉండాలని కోరుతున్నాం. ఈ చట్టం రాజ్యాంగ బద్ధతను ప్రశ్నిస్తూ దాఖలైన వ్యాజ్యాలపై ప్రస్తుతానికి సమయం కేటాయించొద్దని విన్నవిస్తున్నాం’’ అని ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొంది.

వలసపాలకుల నాటి రాజద్రోహం చట్టం చెల్లుబాటును ప్రశ్నిస్తూ దాఖలైన వ్యాజ్యాలను విస్తృత ధర్మాసనానికి నివేదించాలా? లేదా? అన్న అంశంపై ఈ నెల 10న వాదనలు వింటామని ఇటీవల వెల్లడించింది. దీనిపై గతవారం విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం.. ఈ అంశంపై తన స్పందన తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అఫిడవిట్లు దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు మంగళవారం నిర్ణయం తీసుకోనుంది.

కాగా.. గతవారం విచారణ సందర్భంగా అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. రాజద్రోహం చట్టంలోని నిబంధనలు ఉల్లంఘనలకు గురి అవుతున్నాయని, వీటిని నిరోధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అయితే 1962లో కేదార్‌నాథ్‌ కేసులో ఐదుగురు న్యాయమూర్తులిచ్చిన తీర్పును.. ఐదు లేదా ఏడుగురు జడ్జిల ధర్మాసనానికి నివేదించాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. కేదార్‌నాథ్‌ కేసులో నాటి సుప్రీంకోర్టు ధర్మాసనం రాజద్రోహం చట్టం రాజ్యాంగబద్ధతను గుర్తించింది. పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది కపిల్‌సిబల్‌.. ఈ పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

దేశద్రోహ చట్టం 124ఏ రాజ్యాంగ బద్ధతను సవాల్‌ చేస్తూ ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా, మాజీ మేజర్‌ జనరల్‌ ఎస్‌జీ వాంబత్‌కెరెతో పాటు పలువురు గతేడాది జులైలో సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వీటి విచారణను స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. ‘‘మహాత్మా గాంధీ లాంటి స్వాతంత్ర్య సమరయోధుల గళాన్ని అణగదొక్కేందుకు నాటి బ్రిటిష్‌ అధికారులు ఉపయోగించిన ఈ చట్టాన్ని కేంద్రం ఎందుకు రద్దు చేయట్లేదు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అయినా ఇవి మనకు అవసరమా?’’ అని ప్రశ్నించింది. ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయడం ఆందోళన కలిగిస్తోంది అని అభిప్రాయపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని