Power Crisis: భానుడు భగ్గుమంటోన్న వేళ.. ముదురుతోన్న బొగ్గు సంక్షోభం..!

దేశవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతోన్న వేళ దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌, మహారాష్ట్ర, హరియాణా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలను విద్యుత్‌ సంక్షోభం వేధిస్తోంది.

Published : 30 Apr 2022 02:21 IST

బొగ్గు నిల్వలు నిండుకున్నాయంటున్న రాష్ట్రాలు

దిల్లీ: దేశవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతోన్న వేళ పలు రాష్ట్రాలను విద్యుత్‌ సంక్షోభం కుదిపేస్తోంది. ముఖ్యంగా దేశరాజధాని దిల్లీతోపాటు ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌, మహారాష్ట్ర, హరియాణా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు ఇప్పటికే కరెంటు కోతలను మొదలుపెట్టాయి. ఇదే సమయంలో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో బొగ్గు నిల్వలు లేవని పలు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా దిల్లీలోని చాలా విద్యుత్‌ కేంద్రాల్లో కేవలం ఒక్కరోజుకు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయని హెచ్చరించింది. ఇటువంటి సంక్షోభం నుంచి బయటపడేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ ఎంతో అవసరమని సూచించింది.

దిల్లీలో నిండుకున్న నిల్వలు..

దేశవ్యాప్తంగా విద్యుత్‌కు సంబంధించిన పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని.. ఈ సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పరిష్కార మార్గాలు అన్వేషించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పిలుపునిచ్చారు. మరోవైపు రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలను బొగ్గుకొరత తీవ్రంగా వేధిస్తోందని దిల్లీ విద్యుత్‌శాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ పేర్కొన్నారు. ‘కరెంటు నిరంతరాయంగా ఉత్పత్తి అయితే ఎటువంటి సమస్య లేదు. కానీ, విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు మూతపడితే మాత్రం చాలా కష్టం. దేశంలో బొగ్గు కొరత ఉంది. విద్యుత్‌ కేంద్రాల్లో 21 రోజుల ఉత్పత్తికి సరిపడా నిల్వలు ఉండాలి. కానీ, చాలా విద్యుత్‌ కేంద్రాల్లో కేవలం ఒక్కరోజుకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయి’ అని హెచ్చరించారు. ఈ సందర్భంగా కోల్‌ ఇండియా లిమిటెడ్‌కు రాష్ట్రాలు చెల్లింపులు చేయకపోవడం వల్లే బొగ్గు సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని కేంద్రం చేస్తోన్న వాదనను సత్యేందర్‌ జైన్‌ తోసిపుచ్చారు.

రికార్డుస్థాయి వినియోగం..

కేవలం దిల్లీలోనే కాకుండా ఝార్ఖండ్‌, జమ్మూకశ్మీర్‌, రాజస్థాన్‌, హరియాణా, పంజాబ్, ఒడిశా, మహారాష్ట్ర, బిహార్‌, యూపీ, ఏపీ రాష్ట్రాల్లో కరెంటు కష్టాలు మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు పెరగడంతో విద్యుత్‌ వినియోగం భారీగా పెరిగింది. గురువారం ఒక్కరోజే 201గిగావాట్ల మార్కును దాటింది. ఇప్పుడే ఇలా ఉంటే మే- జూన్‌ సమయంలో ఈ డిమాండ్‌ 215-220 గిగావాట్లుగా ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, ఈ పరిస్థితిని పాజిటివ్‌గా చెబుతోన్న కేంద్ర ప్రభుత్వం.. దేశంలో పారిశ్రామిక కార్యకలాపాలు పెరగడం వల్లే విద్యుత్‌ వినియోగం ఈస్థాయిలో పెరిగినట్లు పేర్కొంది. కానీ, ఇదే సమయంలో డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా చేయలేకపోతున్న రాష్ట్రాలు నిత్యం గంటలపాటు కరెంట్‌ కోతలు విధిస్తున్నాయి. ముఖ్యంగా బొగ్గు సరఫరా పెంచుకోకపోవడంతో విద్యుత్‌ ఉత్పత్తి  భారీగా చేయలేకపోతున్నట్లు తెలుస్తోంది.

విద్యుత్‌ సంక్షోభం కాదు.. చెల్లింపు సంక్షోభం..

దేశవ్యాప్తంగా బొగ్గు కొరత ఏర్పడుతోందంటూ రాష్ట్రాలు చేస్తోన్న విమర్శలను కేంద్ర ప్రభుత్వం తిప్పికొడుతోంది. ప్రస్తుతం దేశంలో బొగ్గు సంక్షోభం లేదని.. ఇది కేవలం చెల్లింపు సంక్షోభమేనని కేంద్ర విద్యుత్‌శాఖ పేర్కొంటోంది. కోల్‌ ఇండియాకు సరిగా చెల్లింపులు చేయనందువల్లే బొగ్గు సరఫరాలో అంతరాయానికి కారణమని వెల్లడిస్తోంది. అయితే, చెల్లింపుల గురించి ఇరువైపుల అధికారిక ప్రకటన లేనప్పటికీ కోల్‌ ఇండియా మాత్రం బకాయిలు చెల్లింపులకు సంబంధం లేకుండా థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు సరఫరా చేస్తున్నామని చెబుతోంది. ఇలా బొగ్గు కొరతను ఎదుర్కొంటున్న వేళ కేంద్ర, రాష్ట్రాలు మాత్రం విద్యుత్‌ సంక్షోభంపై విమర్శలు చేసుకుంటూనే ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని