Nitish Kumar: మేము ఎప్పుడైనా ఎన్నికలకు సిద్ధమే: నీతీశ్‌ కుమార్‌

లోక్‌సభ ఎన్నికలను ఎప్పుడు నిర్వహించిన ఇండియా కూటమి సిద్ధంగా ఉందని బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌  (Nitish Kumar)అన్నారు.  

Published : 18 Sep 2023 16:13 IST

పట్నా: సార్వత్రిక ఎన్నికలు ముందుగానే నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని బిహార్‌ ( Bihar) ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌  (Nitish Kumar) వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ఇండియా కూటమి ఎప్పుడైనా సిద్ధంగా ఉందన్నారు. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ సర్కారుపై విమర్శలు గుప్పించారు.

లోక్‌సభ ఎన్నికలను ముందుగానే నిర్వహించేందుకు మోదీ సర్కార్‌ యోచిస్తోందని.. ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పానని నీతీశ్‌ అన్నారు. ఇండియా కూటమి ఐకమత్యంగా ఉందని.. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించిన తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ‘‘ఇండియా కూటమి ఐక్యమత్యంగా పోరాడుతుంది. ప్రజల కోసమే మా కూటమి ఉంది. ఎప్పటికీ వారికి సేవ చేస్తూనే ఉంటుంది. మేమంతా కలిసి బిహార్‌లో రోడ్లు, తాగునీటి సౌకర్యం, విద్యుత్‌, వంతెనలు ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాం’’ అని అన్నారు.

ప్రత్యేక సమావేశాల వేళ.. నేడు కేంద్ర కేబినెట్‌ కీలక భేటీ

అప్పుడే విలేకరులకు ముక్తి లభిస్తుంది

ఈ సందర్భంగా ఆయన జర్నలిస్టుల గురించి ప్రస్తావించారు. దేశంలో విలేకరులకు స్వేచ్ఛ అనేది లేకుండా పోయిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వారిని నియంత్రిస్తుందని ఆరోపించారు. కేంద్రంలో అధికారం మారితే జర్నలిస్టులకు ముక్తి  లభిస్తుందని నీతీశ్‌ వ్యాఖ్యానించారు. అప్పుడు స్వేచ్ఛగా నిజాలను చెప్పగలుగుతారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే తుది నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. పార్లమెంట్‌లో జరిగే ప్రత్యేక సమావేశాలపై నీతీశ్‌ మాట్లాడారు. సెషన్‌ ఎజెండా స్పష్టంగా లేదని ఆరోపించారు. జేడీ(యూ)కు చెందిన 16 మంది ఎంపీలు కీలక అంశాలను సమావేశాల్లో లెవనెత్తుతారని తెలిపారు. ఈ సమావేశంలో నీతీశ్‌తో పాటు డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ కూడా పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని