VAT: ‘కేంద్రం తన బాధ్యత నిర్వహించింది.. ఇప్పుడు రాష్ట్రాల వంతు’

పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో నేటినుంచి లీటరు పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 చొప్పున భారం తగ్గింది. ఇదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వ్యాట్ తగ్గిస్తే ధరలు మరింత...

Published : 05 Nov 2021 01:39 IST

పెట్రో ధరలపై వ్యాట్‌ తగ్గించాలని కేంద్ర మంత్రి కరడ్‌ పిలుపు

దిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో నేటినుంచి లీటరు పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 చొప్పున భారం తగ్గింది. ఇదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వ్యాట్ తగ్గిస్తే ధరలు మరింత తగ్గుతాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కిషన్‌రావు కరడ్‌ పేర్కొన్నారు. గురువారం మంత్రి మాట్లాడుతూ.. కేంద్రం తన బాధ్యత నిర్వహించిందని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

వినియోగదారులకు మరింత ఉపశమనం లభించేలా వ్యాట్ తగ్గించాలని ఆర్థిక శాఖ తరఫున అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్రాలు తమవంతుగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు కనీసం రూ.7 తగ్గించాలని కోరుతున్నామన్నారు. తద్వారా పెట్రోల్‌పై రూ.12, డీజిల్‌పై రూ.17 భారం తగ్గేందుకు ఇది దోహదపడుతుందని వివరించారు. ఇదిలా ఉండగా.. అసోం, త్రిపుర, కర్ణాటక, గోవా, గుజరాత్‌ తదితర రాష్ట్రాలు ఇప్పటికే వ్యాట్‌ తగ్గిస్తున్నట్లు ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఒక్క ఒడిశా మినహా తగ్గింపు ప్రకటించిన రాష్ట్రాలన్నీ దాదాపు భాజపా పాలిత, ఎన్డీయే కూటమి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలే కావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని