Vaccine: ‘5 డోసులు పూర్తి.. ఆరో డోసుకు షెడ్యూల్‌..!’

కరోనా రెండు డోసులు తీసుకున్న ఓ వ్యక్తి తన టీకా ధ్రువపత్రం చూసుకుని అవాక్కయ్యాడు. పేరు తప్పో, అచ్చు తప్పు పడిందో అనుకునేరు.. సర్టిఫికేట్‌లో

Updated : 20 Sep 2021 10:47 IST

టీకా ధ్రువపత్రంలో పొరబాట్లు.. విచారణకు ఆదేశం

మేరఠ్‌: కరోనా రెండు డోసులు తీసుకున్న ఓ వ్యక్తి తన టీకా ధ్రువపత్రం చూసుకుని అవాక్కయ్యాడు. పేరు తప్పో, అచ్చు తప్పు పడిందో అనుకునేరు.. సర్టిఫికేట్‌లో ఆయన టీకా 5 డోసులు తీసుకుని, ఆరో డోసుకు షెడ్యూల్‌ చేసుకున్నట్లుగా ఉంది. దీంతో కంగుతిన్న ఆయన.. అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

మేరఠ్‌లోని సర్ధానా ప్రాంతానికి చెందిన రామ్‌పాల్‌ సింగ్.. భాజపా బూత్‌ స్థాయి నాయకుడు. ఆయన.. ఈ ఏడాది మార్చి 16న తొలి డోసు, మే 8న రెండో డోసు వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఇటీవల తన టీకా ధ్రువపత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోగా.. దాన్ని చూసి రామ్‌పాల్‌ ఆశ్చర్యపోయాడు. అందులో ఆయన ఐదు డోసులు తీసుకుని, ఆరు డోసుకు షెడ్యూల్‌ చేసుకున్నట్లుగా ఉంది. మార్చి 16న తొలి, మే 8న రెండో డోసు, మే 15న మూడో డోసు, సెప్టెంబరు 15న నాలుగో, ఐదు డోసులు ఇచ్చినట్లుగా ఉంది. డిసెంబరు 2021 నుంచి జనవరి 2022 మధ్య ఆరో డోసుకు షెడ్యూల్‌ కన్పిస్తోంది. 

దీంతో ఆయన అధికారులకు ఫిర్యాదు చేశారు. టీకా పంపిణీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తన సర్టిఫికేట్‌లో డోసుల వివరాలు తప్పుగా వచ్చాయని ఆరోపించారు. దీనిపై చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ అఖిలేశ్‌ మోహన్‌ స్పందిస్తూ.. వెబ్‌సైట్‌పై హ్యాకింగ్‌ జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని