ప్రారంభమైన చక్కాజామ్‌.. 

కొత్త సాగు చట్టాల రద్దు ఉద్యమంలో భాగంగా రైతు సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నేడు రాస్తారోకో ప్రారంభమైంది. ‘చక్కా జామ్‌’ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా రైతు మద్దతుదారులంత.........

Updated : 06 Feb 2021 13:59 IST

దిల్లీ: కొత్త సాగు చట్టాల రద్దు ఉద్యమంలో భాగంగా రైతు సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నేడు రాస్తారోకో ప్రారంభమైంది. ‘చక్కా జామ్‌’ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా రైతు మద్దతుదారులంతా రహదారులను దిగ్బంధిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం 3 గంటల వరకు కొనసాగనుంది. మహారాష్ట్రలోని నాసిక్‌, హరియాణాలోని పానిపట్‌, పంజాబ్‌లోని అమృత్‌సర్‌, మొహాలితో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో రైతు ఉద్యమ మద్దతుదారులు రోడ్లపై బైఠాయించారు. గణతంత్ర దినోత్సవాన దిల్లీలో చేపట్టిన ట్రాక్టర్ల కవాతు తర్వాత రైతులు చేపడుతున్న అతిపెద్ద ఆందోళన కార్యక్రమం ఇదే. దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లకు మినహాయింపునిస్తున్నట్లు శుక్రవారం రైతు సంఘాలు వెల్లడించాయి.

మరోవైపు గణంత్ర పరేడ్‌ ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకొని దేశ రాజధానిలో పోలీసులు అప్రమత్తమయ్యారు. రైతులు ఆందోళన చేస్తున్న సరిహద్దుల్లో డ్రోన్లతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. గాజీపుర్‌ సరిహద్దుల్లో మరిన్ని బారికేడ్లను ఏర్పాటు చేశారు. జలఫిరంగులు సిద్ధంగా ఉంచారు. చారిత్రక ఎర్రకోట వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు దిల్లీ వ్యాప్తంగా మెట్రో స్టేషన్లలో సిబ్బంది అప్రమత్తమయ్యారు. పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతానికి ఖాన్‌ మార్కెట్‌, నెహ్రూ ప్లేస్‌, మండీ హౌస్‌, ఐటీవో, ఇండియా గేట్‌ స్టేషన్ల ఎంట్రీ, ఎగ్జిట్‌ గేట్లను మూసివేశామని అధికారులు తెలిపారు. అవసరమైతే మరికొన్ని స్టేషన్లలోనూ ముందుజాగ్రత్త చర్యలు చేపడతామని తెలిపారు. అటు సింఘు, టిక్రీ సరిహద్దుల్లోనూ భారీగా భద్రత బలగాలు పహారా కాస్తున్నాయి. చక్కా జామ్‌కు కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.

పంజాబ్ ఒక్కటే కాదు.. 

సాగు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌ ప్రజలు మాత్రమే ఉద్యమించడం లేదని.. యావత్తు దేశం పోరాటం చేస్తోందని మాజీ కేంద్ర మంత్రి, శిరోమణి అకాళీదళ్‌ నాయకురాలు హర్‌సిమ్రత్‌ కౌర్‌ అన్నారు. అన్ని ప్రధాన నగరాల్లో రైతు మద్దతుదారులు నిరసనకు దిగుతున్నారన్నారు. అయినా, కేంద్రం వారి డిమాండ్లపై నిర్లక్ష్యం వహిస్తే ఎవరూ ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు. మరోవైపు పంజాబ్‌ యువకులపై నమోదైన కేసుల్ని కొట్టివేయించే బాధ్యత ఆ రాష్ట్ర సీఎం అమరీందర్‌ సింగ్‌పైనే ఉందన్నారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేయకుండానే వారిపై అక్రమ కేసులు బనాయించారన్నారు. వారిని కాపాడాల్సిన బాధ్యత పంజాబ్‌ ప్రభుత్వంపైనే ఉందన్నారు. 
 

ఇవీ చదవండి...

దిల్లీ:50 వేల మంది పోలీసులు.. జల ఫిరంగులు

సంయమనం పాటించండి!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని