Corona: థర్డ్‌ వేవ్‌ ముప్పు.. కేజ్రీవాల్‌ హెచ్చరిక!

కరోనా వైరస్‌ థర్డ్‌ వేవ్‌కు అవకాశాలు ఉన్నాయని దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ హెచ్చరించారు. కరోనా మహమ్మారిని యుద్ధ ప్రాతిపదికన ఎదుర్కొనేందుకు......

Published : 12 Jun 2021 21:44 IST

ఎదుర్కొనేందుకు తాము సిద్ధమేనన్న దిల్లీ సీఎం


దిల్లీ:  కరోనా వైరస్‌ థర్డ్‌ వేవ్‌కు అవకాశాలు ఉన్నాయని దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ హెచ్చరించారు. కరోనా మహమ్మారిని యుద్ధ ప్రాతిపదికన ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. కరోనా మూడో ముప్పు భయాలపై యూకే నుంచి సంకేతాలు వస్తున్నాయని.. అక్కడ 45శాతం మేర వ్యాక్సినేషన్‌ జరిగినప్పటికీ కేసులు పెరుగుతున్నాయని వివరించారు. అందువల్ల, ఏమీ చేయకుండా తాము కూర్చోలేమన్నారు. శనివారం ఆయన దిల్లీలోని తొమ్మిది ఆస్పత్రుల్లో 22 కొత్త ఆక్సిజన్‌ ప్లాంట్‌ల ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆన్‌లైన్‌ ఈవెంట్‌లో పాల్గొని మాట్లాడారు. ఈ కొత్త ఆక్సిజన్‌ ప్లాంట్‌లు కరోనాపై పోరాటంలో ప్రభుత్వ సన్నద్ధతను మరింతగా బలోపేతం చేస్తాయన్నారు. దిల్లీ ప్రభుత్వం ఆక్సిజన్‌ ట్యాంకర్లను కూడా సేకరిస్తోందని తెలిపారు.

సెకండ్‌ వేవ్‌పై పోరాటంలో దిల్లీ ప్రజలు భుజం భుజం కలిపి ఐక్యంగా నిలబడ్డారని, పారిశ్రామిక రంగం కూడా ఈ పోరులో భాగస్వామిగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సెకండ్‌ వేవ్‌పై ఐక్యపోరాటం చేసిన దిల్లీ ప్రలజకు అభినందనలు తెలిపారు. వారి పోరాటం, క్రమశిక్షణ వల్లే కరోనా సెకండ్‌ వేవ్‌ను అదుపుచేయడంలో విజయం సాధించగలిగామన్నారు. థర్డ్‌వేవ్‌ రాకుండా ఉండాలని ప్రార్థిస్తున్నామని, ఒకవేళ వస్తే గనక మరోసారి ఐక్య పోరాటంతో ఎదుర్కొంటామన్నారు.

భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన ఏర్పాట్లలో దిల్లీ బిజీగా ఉందన్నారు. దిల్లీలోని వేర్వేరు చోట్ల తొమ్మిది ఆస్పత్రుల్లో మొత్తం 22 పీఎస్‌ఏ ఆక్సిజన్‌ ప్లాంట్లు ప్రారంభించినట్టు ట్విటర్‌లో తెలిపారు. వీటి ద్వారా 17.3 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి చేయవచ్చన్నారు. జులై మాసంలో మరో 17 ఆక్సిజన్‌ ప్లాంట్లు నెలకొల్పనున్నట్టు పేర్కొన్నారు. దిల్లీ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పనిచేస్తోందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని