Chardham Yatra: చార్‌ధామ్‌ యాత్రికులకు ఊరట.. ఇవి తప్పనిసరి కాదు!

చార్‌ధామ్‌ యాత్రికులకు ఊరట కలిగించే అంశం. మే 3న ప్రారంభం కానున్న ఈ యాత్రలో పాల్గొనే భక్తులకు ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం కొవిడ్ పరీక్ష, వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్‌ నుంచి మినహాయింపు ఇచ్చింది. అయితే, యాత్రకు ముందు భక్తులందరూ...

Published : 30 Apr 2022 13:42 IST

దెహ్రాదూన్‌: చార్‌ధామ్‌ యాత్రికులకు ఊరట కలిగించే అంశం. మే 3న ప్రారంభం కానున్న ఈ యాత్రలో పాల్గొనే భక్తులకు ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం కొవిడ్ పరీక్ష, వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్‌ నుంచి మినహాయింపు ఇచ్చింది. అయితే, యాత్రకు ముందు భక్తులందరూ విధిగా రాష్ట్ర పర్యాటక పోర్టల్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించింది. ఒకవైపు యాత్ర తేదీ సమీపిస్తుండటం.. మరోవైపు ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికులకు కొవిడ్ నిబంధనల విషయంలో గందరగోళం నెలకొనడంతో.. సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ సూచనల మేరకు ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ సంధు సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకు యాత్రను సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

ప్రస్తుతానికి.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు, భక్తులు ముందుగా కొవిడ్ పరీక్ష చేయించుకోవడం, వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ సమర్పించడం తప్పనిసరి కాదని సీఎస్‌ తెలిపారు. అయితే, చార్‌ధామ్ యాత్ర కోసం పర్యాటక శాఖ నిర్వహిస్తున్న పోర్టల్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. మరోవైపు.. ఇప్పటివరకు దాదాపు 1.5 లక్షల మంది ఈ యాత్ర కోసం రిజిస్ట్రేషన్‌ పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో కొవిడ్‌ కేసులు మళ్లీ పెరుగుతోన్న నేపథ్యంలో.. భక్తులకు నెగెటివ్‌ ఆర్టీపీసీఆర్‌ రిపోర్టు తప్పనిసరి అని తొలుత వార్తలు వెలువడ్డాయి. గతంలో భక్తుల సంఖ్యపై పరిమితులూ విధించారు. ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా శుక్రవారం 4.96 లక్షల మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. 3,688 మందికి పాజిటివ్‌గా వచ్చిన విషయం తెలిసిందే. ముందురోజు కంటే 300 అధికంగా కొత్త కేసులొచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని