ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు.. చార్‌ధామ్‌ యాత్ర నిలిపివేత

ఉత్తరాఖండ్‌ గర్వాల్‌ డివిజన్‌లో భారీ వర్షాల కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో చార్‌ధామ్‌ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. 

Updated : 07 Jul 2024 17:49 IST

దేహ్రాదూన్‌: దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్‌ (Uttarakhand)ను భారీ వర్షాలు (Heavy rains) అతలాకుతలం చేస్తున్నాయి. ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో భారత వాతావరణశాఖ (IMD) రెడ్‌ అలర్ట్‌ (Red Alert) జారీ చేసింది. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది.

ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ ప్రాంతంలో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. దీంతో చార్‌ధామ్‌ యాత్రను వాయిదా వేసినట్లు గర్వాల్‌ కమిషనర్‌ వినయ్‌ శంకర్‌ పాండే తెలిపారు. వర్షాల కారణంగా చమోలీ జిల్లాలోని బద్రీనాథ్‌ నేషనల్ హైవేపై పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఫలితంగా వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

జగన్నాథుడి రథయాత్ర.. కిక్కిరిసిన పూరీ వీధులు

కర్ణప్రయాగ, గౌచర్‌ మధ్యలోని బద్రీనాథ్‌ నేషనల్ హైవేపై శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు బద్రీనాథ్ ఆలయాన్ని దర్శించుకుని బైక్‌పై తిరిగొస్తుండగా.. మార్గమధ్యంలో కొండచరియలు (Landslides) విరిగి పడ్డాయి. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. అదే రోజు రాంనగర్‌లోని ఓ వంతెన కూలిపోయింది. రెడ్ అలర్ట్ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్ని కలెక్టర్లను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పరిస్థితులపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని ఆదేశించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని