West Bengal: దారుణం.. మనుషుల్ని లోపల పెట్టి.. ఇళ్లకు నిప్పంటించి..!

పశ్చిమ బెంగాల్‌లో హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. ఓ రాజకీయ నాయకుడి హత్య అనంతరం చెలరేగిన ఉద్రిక్తతల్లో 8 మంది సజీవ దహనమయ్యారు. హత్యకు

Updated : 22 Mar 2022 16:26 IST

బెంగాల్‌లో చెలరేగిన హింస.. 8 మంది మృతి

బీర్భుమ్‌: పశ్చిమ బెంగాల్‌లో హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. ఓ రాజకీయ నాయకుడి హత్య అనంతరం చెలరేగిన ఉద్రిక్తతల్లో 8 మంది సజీవ దహనమయ్యారు. హత్యకు నిరసనగా ఆందోళనకు దిగిన కొందరు ఇళ్లకు నిప్పంటించడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..

బీర్భుమ్‌ జిల్లాలోని రాంపూర్‌హట్‌ ప్రాంతంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ పంచాయతీ నాయకుడు భదు ప్రధాన్‌ సోమవారం రాత్రి హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై నాటు బాంబులు విసరడంతో తీవ్రంగా గాయపడిన ఆయన చికిత్స పొందుతూ మృతిచెందారు. అయితే ఈ ఘటన జరిగిన కొద్ది గంటల తర్వాత మంగళవారం తెల్లవారుజామున రాంపూర్‌హట్‌ ప్రాంతంలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. 

కొందరు గుర్తుతెలియని వ్యక్తులు మనుషుల్ని లోపల పెట్టి, ఇళ్లకు తాళాలు వేసి నిప్పంటించినట్లు స్థానికులు చెబుతున్నారు. 10-12 నివాసాలకు మంటలు అంటుకున్నాయి. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ఈ ఘటనలో 8 మంది మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. భదు ప్రధాన్‌ హత్యకు ప్రతీకారంగానే ఈ అల్లర్లు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటన రాష్ట్రంలో రాజకీయంగా తీవ్ర దుమారానికి దారితీసింది. అసెంబ్లీలో ప్రతిపక్షాలు ఈ అంశాన్ని లేవనెత్తుతూ ప్రభుత్వంపై మండిపడ్డాయి. అయితే ఈ అల్లర్ల వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదని, ఘటనపై దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ కేసులో దర్యాప్తు చేపట్టేందుకు బెంగాల్‌ ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) ఏర్పాటు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని