Tamil Nadu: కళాక్షేత్రలో లైంగిక వేధింపులు.. దద్దరిల్లిన తమిళనాడు

తమిళనాడులోని ప్రతిష్ఠాత్మక సంస్థ కళాక్షేత్ర( Kalakshetra)లో విద్యార్థులు కొద్దిరోజులుగా నిరసలు చేస్తున్నారు. అందుకు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులు, వర్ణవివక్షే కారణమని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఒకరిపై కేసు నమోదైంది.  

Updated : 01 Apr 2023 11:37 IST

చెన్నై: లైంగిక వేధింపుల నిరసనలతో తమిళనాడు(Tamil Nadu) దద్దరిల్లుతోంది. ప్రతిష్ఠాత్మక సంప్రదాయ కళల సంస్థ కళాక్షేత్ర(Kalakshetra) ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఆ సంస్థలోని అసిస్టెంట్‌ ప్రొఫెసర్, మరో ముగ్గురు ఆర్టిస్టులు( repertory artists) తనపై వేధింపులకు పాల్పడ్డారంటూ ఓ పూర్వ విద్యార్థిని చేసిన ఆరోపణలు వివాదాస్పదంగా మారాయి. లైంగిక వేధింపులు, బాడీషేమింగ్, దూషణలకు పాల్పడ్డారనే ఆరోపణలపై  కొద్దిరోజులుగా దాదాపు 200 మంది విద్యార్థినులు, విద్యార్థులు ఆందోళన చేపడుతున్నారు. ఈ క్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై కేసు నమోదైంది.

శుక్రవారం 90 మంది విద్యార్థులు రాష్ట్ర మహిళా కమిషన్‌ చీఫ్‌కు ఫిర్యాదుచేశారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌( MK Stalin)కు లేఖ రాశారు. తప్పు చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. స్టాలిన్‌తోపాటు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డికి రాసిన లేఖలో.. ఏళ్లుగా ఈ వేధింపులు, వర్ణ వివక్ష ఎదుర్కొంటున్నామని, ఈ ఫిర్యాదులపై యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కళాక్షేత్ర డైరెక్టర్‌ రేవతి రామచంద్రన్‌ను పదవి నుంచి తొలగించాలని కోరారు. ఇదిలా ఉంటే.. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలు అంటూ జాతీయ మహిళా కమిషన్ తోసిపుచ్చడం గమనార్హం. 

కురుక్షేత్ర ఫౌండేషన్‌ను 1936లో రుక్మిణీ దేవీ అరుందాలే స్థాపించారు. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ భరతనాట్యం వంటి సంప్రదాయ కళలకు సంబంధించిన కోర్సులు అందిస్తారు. ఉన్నత ప్రమాణాలు, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిని ఈ సంస్థ.. ఎంతోమంది ప్రముఖ కళాకారులను తయారుచేసింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని