Cheque Bounce: ఫిల్మ్‌ అవార్డు విజేతలే.. కానీ, చెక్‌ బౌన్స్‌

అస్సాం స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డు (Assam State film award) విజేతలకు ప్రదానం చేసిన చెక్‌లు బౌన్స్‌ అవ్వడం చర్చనీయాంశమైంది. అయితే.. సాంకేతిక కారణాల వల్లే ఇలా జరిగిందని నిర్వాహకులు వివరణ ఇచ్చారు.

Published : 18 Mar 2023 23:39 IST

దిస్‌పూర్‌: అస్సాం స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డు (Assam State film award) విజేతలకు ఊహించని అనుభవం ఎదురైంది. అవార్డుల ప్రదానోత్సవ సందర్భంగా ఇచ్చిన చెక్‌ (Cheque)లను బ్యాంక్‌లో డిపాజిట్‌ చేయగా అవి బౌన్స్‌ అయినట్లు తేలింది. దీంతో ఆశ్చర్యపోవడం విజేతలవంతైంది. అస్సాం స్టేట్‌ ఫిల్మ్‌ ఫైనాన్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ASFFDC) ఆధ్వర్యంలో సోమవారం స్టేట్‌ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. మొత్తం 8 మంది విజేతలకు 9 చెక్కులు పంపిణీ చేశారు. అయితే, వాటిని డ్రా చేసుకునేందుకు కొందరు శుక్రవారం బ్యాంకులకు వెళ్లారు. తీరా అక్కడ పరిశీలిస్తే.. అవి బౌన్స్‌ అయినట్లు తేలింది. దీంతో వారంతా సంబంధిత అధికారులకు ఫోన్‌ చేశారు. ఖాతాలో సరిపడా నగదు లేకపోవడంతో చెక్ బౌన్స్‌ అయ్యాయని  వారు వివరణ ఇచ్చారు.

చెక్‌ బౌన్స్‌  విషయం ఒక్కసారిగా గుప్పుమనడంతో సాంస్కృతిక శాఖ మంత్రి బిమల్‌ బరోచ్‌ అధికారులతో మాట్లాడారు. తక్షణమే ఈ అంశంపై విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఉత్తమ రైటింగ్‌ విభాగంలో అవార్డు గెలుచుకున్న పుజారీని శనివారం మరోసారి చెక్‌ డిపాజిట్‌ చేయాల్సిందిగా నిర్వాహకులు కోరారు. మరోవైపు కేవలం సాంకేతిక కారణాల వల్లే చెక్స్‌ బౌన్స్‌ అయినట్లు ASFFDC వెల్లడించింది. తొలి రోజు రూ.18 లక్షల విలువైన చెక్‌లను క్లియర్‌ చేశామని, ఆ తర్వాతి రోజు డిపాజిట్‌ చేసిన చెక్‌లు మాత్రమే బౌన్స్‌ అయ్యాయని వివరణ ఇచ్చింది.

మరో వివాదం

ఉత్తమ మహిళా ప్లే బ్యాక్‌ సింగర్‌ విభాగంలో అవార్డు పొందిన నహిద్‌ అఫ్రిన్‌ వివాదంలో చిక్కుకున్నారు. ఆమె పాడని పాటకు గుర్తింపు లభించడం ఈ అవార్డుల్లో మరో వివాదానికి దారి తీసింది. అఫ్రిన్‌ ‘నిజానర్‌ గాన్‌’ సినిమాకు ప్లే బ్యాక్‌ సింగర్‌గా వ్యవహరించారు. అయితే ఆమె అవార్డు అందుకుంటున్నప్పుడు బ్యాక్‌ గ్రౌండ్‌లో వేరే పాట ప్లే అయ్యింది. దీంతో ఆమె ఆ పాట పాడలేదు కదా.. అవార్డు ఎలా వచ్చిందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై సాంసృతిక శాఖ మంత్రి వివరణ ఇచ్చారు. అఫ్రిన్‌ అవార్డు గెలుచుకున్న మాట వాస్తవమేనని, అయితే అవార్డు బహూకరణ సమయంలో మానవ తప్పిదం కారణంగా వేరే లిరిక్స్‌ ప్లే అయ్యాయని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని