ఫోన్‌ కోసం రిజర్వాయర్‌ తోడిన ఘటన.. ఆ నీళ్లకు డబ్బులు వసూలు చేయండి..!

అసలే వేసవి కాలం ప్రజలు నీళ్లు లేక ఇక్కట్లు పడుతుంటే.. ఫోన్‌ కోసం రిజర్వాయర్‌లో నీటిని తోడేసి ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh) అధికారి చిక్కుల్లో పడ్డారు. అతడి నుంచి డబ్బులు వసూలు చేయాలని సంబంధిత అధికారులు భావిస్తున్నారు. 

Updated : 30 May 2023 16:16 IST

భోపాల్‌: ఖరీదైన ఫోన్‌ కోసం ఓ అధికారి రిజర్వాయర్‌లోని 41 లక్షల లీటర్ల నీటిని తోడిన ఘటన గుర్తుంది కదా..! అతడిపై ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే సస్పెన్షన్ వేటు వేసింది. అలాగే వృథా చేసిన నీటికి అతడి జీతం నుంచి డబ్బులు వసూలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

రాజేశ్‌ విశ్వాస్‌(Rajesh Vishwas) అనే వ్యక్తి ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)కు చెందిన కాంకేర్‌ జిల్లాలో ఫుడ్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అతడు ఇటీవల స్థానికంగా ఉన్న ఖేర్‌కట్టా డ్యామ్(Kherkatta Dam) సందర్శనకు వచ్చిన సమయంలో సెల్ఫీ తీసుకుంటుండగా స్మార్ట్‌ఫోన్ అక్కడి ఓవర్‌ ఫ్లో ట్యాంక్ నీటిలో పడిపోయింది. రూ.లక్ష ఖరీదైన ఫోన్ కావడం, అందులో అధికారిక సమాచారం ఉందని తెలపడంతో దాన్ని కనిపెట్టేందుకు తొలుత స్థానిక ఈతగాళ్లను రంగంలోకి దించారు. 15 అడుగుల లోతైన నీళ్లలో వారు ఎంత వెతికినా ఫలితం లేకపోయింది.

దీంతో ఈ విషయంపై జలవనరుల విభాగం అధికారికి మౌఖికంగా సమాచారం ఇచ్చిన ఆ అధికారి.. రెండు భారీ మోటార్లతో నీళ్లను ఖాళీ చేయించడం ప్రారంభించారు. గత సోమవారం సాయంత్రం నుంచి గురువారం వరకు మూడు రోజుల్లో దాదాపు 41 లక్షల లీటర్ల నీళ్లను బయటకు తోడేశారు. ఈ నీటితో 1500 ఎకరాల సాగునీటి అవసరాలు తీరతాయని తెలుస్తోంది. ఒకవైపు ప్రజలు నీటి ట్యాంకర్లపై ఆధారపడుతుంటే.. ఈ స్థాయిలో నీటి వృథాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో చర్యలు చేపట్టిన అధికారులు విశ్వాస్‌పై సస్పెన్షన్ వేటు వేశారు.

అలాగే ఆ అధికారి నుంచి డబ్బు వసూలుచేసే విషయమై ఇంద్రావతి ప్రాజెక్టు సూపరింటెండెంట్‌ ఇంజినీర్.. జలవనరుల శాఖ ఎస్‌డీవో రాంలాల్‌ ధివర్‌(నీరు తోడేందుకు విశ్వాస్‌కు మౌఖికంగా అనుమతి ఇచ్చిన అధికారి)కు లేఖ రాశారు. ఆ రిజర్వాయర్ నీరు వ్యవసాయానికి, వేసవిలో ఇతర అవసరాలకు వినియోగిస్తారు. రాష్ట్ర ప్రజల అవసరాలకు వినియోగించే నీటిని వృథా చేసినందుకు.. దానికి విలువ కట్టి, ఎందుకు వసూలు చేయకూడదని ప్రశ్నించారు. దీనిపై వివరణ కోరారు.  ఇదిలా ఉంటే.. ఆ ఫోన్‌ను బయటకు తీసేందుకు కొంత మేర నీళ్లను తోడేందుకే అనుమతి ఇచ్చామని, కానీ.. చాలా ఎక్కువే ఖాళీ చేశారని జలవనరుల విభాగం అధికారి ఇదివరకు వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఫోన్‌ను బయటకు తీసినప్పటికీ.. అది మూడు రోజుల పాటు నీటిలో ఉండేసరికి పనిచేయడం లేదని తెలిసింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు