Power crisis: విద్యుత్‌ కొరతకు భలే పరిష్కారం వెతికారే!: చిదంబరం

దేశంలో పలు రాష్ట్రాల్లో విద్యుత్ ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వలు తగ్గడంతో విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది.

Published : 30 Apr 2022 14:33 IST

ఇది కూడా కాంగ్రెస్‌ మీద తోసేయండంటూ మాజీ మంత్రి కౌంటర్

దిల్లీ: దేశంలో పలు రాష్ట్రాల్లో విద్యుత్ ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వలు తగ్గడంతో విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది. ఈ నేపథ్యంలో బొగ్గు రవాణా చేసే రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు కేంద్రం ప్రయాణికుల రైళ్లను రద్దు చేస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భలే గొప్ప పరిష్కారం వెతికారంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. 

‘సమృద్ధిగా లభిస్తోన్న బొగ్గు, భారీ స్థాయిలో ఉన్న రైల్వే వ్యవస్థ, పూర్తిస్థాయిలో వినియోగించుకునే అవకాశం ఉన్న థర్మల్ ప్లాంట్లు. అయినా సరే, విద్యుత్ కొరత నెలకొని ఉంది. ఇందుకు మోదీ ప్రభుత్వాన్ని నిందించలేం. ఇందుకు 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనే కారణం. ఈ విషయంలో బొగ్గు, రైల్వే, విద్యుత్‌ శాఖల అసమర్థత ఏమీ లేదు. గతంలో ఈ శాఖలను నిర్వహించిన కాంగ్రెస్‌ మంత్రులదే తప్పంతా. ఈ విద్యుత్‌ అంతరాయాలను తొలగించేందుకు కేంద్రం భలే పరిష్కారం వెతికింది. ప్రయాణికుల రైళ్లను రద్దు చేసి, బొగ్గు రవాణా రైళ్లను నడుపుతోంది’ అంటూ తీవ్రంగా మండిపడ్డారు. 

విద్యుత్ ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వల్ని పెంచేందుకు రవాణా నిమిత్తం నిన్న కేంద్రం 42 ప్రయాణికుల రైళ్లను రద్దు చేసింది. తదుపరి ఉత్తుర్వులు వచ్చే వరకు ఈ రాకపోకలు నిలిచిపోనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. రానున్న రోజుల్లో మరిన్ని ప్రయాణికుల రైళ్లను రద్దు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మే నెలాఖరు వరకు 650కి పైగా ప్రయాణికుల రైళ్ల రాకపోకలను రద్దు చేసేందుకు రైల్వేశాఖ నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లతో పాటు మెయిల్‌, కమ్యూటర్‌ ట్రైన్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా.. రైళ్ల రద్దు తాత్కాలికమేనని, బొగ్గు సరఫరా సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత ఈ సేవలను పునరుద్ధరించనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. పలు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతుండటంతో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరుగుతోంది. అయితే బొగ్గు కొరత కారణంగా డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి లేకపోవడంతో అనేక చోట్ల కరెంట్ కోతలు వేధిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని