Chidambaram: ‘మేం ఓడలేదు.. వాళ్లే గెలిచారు’ అన్నట్లుంది నిర్మలమ్మ లెక్క..!

రూపాయి విలువ క్షీణించడం లేదని, డాలర్‌ విలువే బలపడుతోందంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Published : 17 Oct 2022 15:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రూపాయి విలువ పతనంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన వ్యాఖ్యలకు మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి. చిదంబరం గట్టి కౌంటర్‌ ఇచ్చారు. ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు సాధారణంగా చెప్పే ‘మేం ఓడలేదు.. వాళ్లే గెలిచారు’ అన్నట్లుగా ఉందంటూ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. అసలేం జరిగిందంటే..

రూపాయి విలువ జీవితకాల కనిష్ఠానికి పడిపోవడంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదివారం స్పందించారు. ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రూపాయి బలహీనపడటం లేదని, డాలర్‌ విలువే బలపడుతోందని వ్యాఖ్యానించారు. ఇతర దేశాల కరెన్సీలతో పోల్చుకుంటే రూపాయి విలువ ఆశాజనకంగానే ఉన్నట్లు చెప్పారు.

అయితే ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. నిర్మలమ్మ వ్యాఖ్యలపై రాజ్యసభ ఎంపీ చిదంబరం ట్విటర్‌లో స్పందిస్తూ.. ‘‘రూపాయి బలహీనపడట్లేదు.. డాలరే బలపడుతోందని ఆర్థిక మంత్రి చెప్పారు. ఇది అక్షరాలా నిజమే..! ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన అభ్యర్థి లేదా పార్టీ కూడా ఎప్పుడూ ఇలాగే ‘మేం ఓడిపోలేదు. అవతలి పార్టీనే గెలిచింది’ అని చెబుతుంటారు’’ అంటూ ఆర్థిక మంత్రికి చురకలంటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని