Child Labour: బాలకార్మికులుగా 16కోట్ల మంది చిన్నారులు!

గత రెండు దశాబ్దాల కాలంలో మొదటిసారిగా బాల కార్మికుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు యునిసెఫ్‌ నివేదిక వెల్లడించింది.

Published : 10 Jun 2021 23:23 IST

గత నాలుగేళ్లలోనే 84లక్షల మంది పెరుగుదల - యునిసెఫ్‌

వాషింగ్టన్‌: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారి ప్రభావం కారణంగా వ్యవస్థలన్నీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. చిన్నారులపై ఇది ఎనలేని భారాన్ని మోపుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇదే సమయంలో గత రెండు దశాబ్దాల కాలంలో మొదటిసారిగా బాల కార్మికుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు యునిసెఫ్‌ నివేదిక వెల్లడించింది. గడిచిన నాలుగేళ్లలోనే (2020 ప్రారంభం నాటికి) 84లక్షల మంది పిల్లలు కార్మికులుగా మారినట్లు తెలిపింది. తాజాగా కరోనా సంక్షోభం వల్ల 2022 చివరినాటికి మరో 90లక్షల మంది చిన్నారులు కార్మికులుగా మారే ప్రమాదముందని యునిసెఫ్‌ హెచ్చరించింది.

2020 సంవత్సరం ప్రారంభం నాటికి ప్రపంచవ్యాప్తంగా 16కోట్ల మంది చిన్నారులు బాలకార్మిక వ్యవస్థలో కూరుకుపోయినట్లు అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO), ఐక్యరాజ్యసమితి పిల్లల విభాగం యునిసెఫ్‌ విడుదల చేసిన సంయుక్త నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా గడిచిన నాలుగేళ్లలోనే 84లక్షల మంది చిన్నారులు బాలకార్మికులుగా మారినట్లు అంచనా వేసింది. కరోనా వైరస్‌ మహమ్మారి ప్రారంభం కాకముందే ఈ పెరుగుదల ప్రారంభమైంది. 2000 నుంచి 2016 మధ్య కాలంలో 9.4కోట్లకు తగ్గిన బాల కార్మికుల సంఖ్య.. గడిచిన నాలుగేళ్లలోనే ఊహించని విధంగా పెరిగిందని తాజా నివేదికలో యునిసెఫ్‌ పేర్కొంది. ముఖ్యంగా ఐదు నుంచి 17ఏళ్ల వయసు కలిగిన పిల్లలు ప్రమాదకర పనుల్లో నిమగ్నం కావడం వారి విద్య, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

10మంది పిల్లల్లో ఒకరు..!

కొవిడ్‌ ప్రభావం ప్రారంభమైన తర్వాత బాల కార్మికుల సంఖ్య మరింత పెరుగుతునట్లు తాజా నివేదిక వెల్లడించింది. ప్రపంచంలో ప్రతి పది మంది చిన్నారుల్లో ఒకరు బాలకార్మికులుగా మారుతున్నట్లు అంచనా వేసింది. ముఖ్యంగా ఆఫ్రికాలోని సహారా ప్రాంతాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని అభిప్రాయపడింది. సంక్షోభ సమయంలో ఆపదలో ఉన్న కుటుంబాలను సరైన విధంగా ఆదుకోకుంటే రానున్న రెండేళ్లలో మరో 5కోట్ల చిన్నారులు బాలకార్మిక వ్యవస్థలోకి జారుకునే ప్రమాదముందని హెచ్చరించింది.

‘ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్‌లు, పాఠశాలలు మూతపడడం, ఆర్థిక వ్యవస్థల్లో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న సమయంలో కుటుంబాలు కఠిన నిర్ణయాలవైపు అడుగులు వేస్తున్నాయి. వారి పిల్లల్ని పనివైపు నడిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల వల్ల బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించే పోరాటంలో తీవ్రంగా వెనకబడిపోతున్నాం’ అని యునిసెఫ్‌ చీఫ్‌ హెన్‌రైటా ఫోర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా ప్రభుత్వాలు తక్షణమే స్పందించి, ఈ సంక్షోభానికి పరిష్కార మార్గాలు చూపకపోతే రానున్న రోజుల్లో దారుణ పరిస్థితులకు కారణమవుతాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని