కరోనాపై ‘ప్యాకేజీ’గా పోరాడకపోతే ఇంతే..!

‘‘..వీడేంటిరా చాలా శ్రద్ధగా కొట్టాడు.. ఏదో ఒక గోడ కడుతున్నట్లు.. గులాబీ మొక్కకు అంటుకడుతున్నట్లు.. చాలా జాగ్రత్తగా.. పద్దతిగా కొట్టాడ్రా..!’’ అంటూ ‘అతడు’ చిత్రంలో తనికెళ్ల భరణి చేసిన వర్ణన..

Updated : 19 Apr 2021 12:45 IST

* చిలీ నిలువెత్తు నిదర్శనం..

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

‘‘..వీడేంటిరా చాలా శ్రద్ధగా కొట్టాడు.. ఏదో ఒక గోడ కడుతున్నట్లు.. గులాబీ మొక్కకు అంటుకడుతున్నట్లు.. చాలా జాగ్రత్తగా.. పద్ధతిగా కొట్టాడ్రా..!’’ అంటూ ‘అతడు’ చిత్రంలో నటుడు తనికెళ్ల భరణి చేసిన వర్ణన.. కొవిడ్‌పై ఎలా పోరాడాలి అనే దానికి అతికినట్లు సరిపోతుంది. అవును! కొవిడ్‌పై పోరాటంలో ఏమాత్రం అజాగ్రత్త పనికిరాదు.  చాలా పద్ధతిగా.. శ్రద్ధగా వైరస్‌ను ఓడగొట్టాలి.

‘టీకా వేయించుకున్నా.. ఇంకేం కాదులే !’ అని జనం విచ్చలవిడిగా తిరిగితే ఏమవుతుందో అనే దానికి చిలీ దేశం చక్కటి ఉదాహరణ. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శాతం ప్రజలకు టీకాలు ఇచ్చిన తొలి ఐదు దేశాల్లో చిలీది మూడో స్థానం. ఈ అంకెను చూసి సంబరపడాల్సిన అవసరం లేదు.. ఇక్కడ టీకాలు ఇవ్వడం ప్రారంభించినప్పటి నుంచి విచిత్రంగా కేసుల సంఖ్య భారీగా పెరుగుతూ వస్తోంది. దీనికి కారణాలను అన్వేషించిన పరిశోధకులకు ఓ విషయం తెలిసింది. అదే ప్రజల స్వయంకృతం.. నిర్లక్ష్యం..!

వాస్తవానికి కరోనాపై పోరులో టీకాలేమీ రామబాణాలు కాదని వైద్యులు నెత్తీనోరు బాదుకొని చెబుతున్నారు. టీకాలు తీసుకొన్నా ఇన్ఫెక్షన్‌ రాకుండా ఆపలేమని.. కేవలం ఇన్ఫెక్షన్‌ నుంచి వచ్చే దుష్పరిణామాలను గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొంటున్నారు. టీకాలు.. మాస్కులు.. శానిటైజర్లు.. భౌతిక దూరం వంటివి ఓ ప్యాకేజీలా అమలు చేసి మాత్రమే వైరస్‌ను జయించవచ్చని పేర్కొంటున్నారు. చిలీలో మాత్రం ప్రజలు చాలా నిర్లక్ష్యపు పనులను కట్టకట్టుకొని ఒకేసారి చేయడంతో ఆ ఫలితం అనుభవిస్తున్నారు. ఇక్కడ దాదాపు 40శాతం మంది ప్రజలు టీకా వేయించుకున్నా.. ఏప్రిల్‌ 17వ తేదీ ఒక్కరోజే 8వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. వాస్తవంగా ఆస్థాయిలో వ్యాక్సినేషన్‌ అయిన దేశాల్లో కేసులు గణనీయంగా తగ్గిపోయాయి. ఇజ్రాయెల్‌.. బ్రిటన్‌లే దీనికి ఉదాహరణ. ఇజ్రాయెల్‌ అయితే తాజాగా బహిరంగ ప్రదేశాల్లో మాస్కుల నిబంధనను కొంత సడలించింది కూడా. కానీ, చిలీలో మాత్రం పరిస్థితి ఘోరంగా ఉంది..! ఇంటెన్సివ్‌‌ కేర్‌ యూనిట్లు నిండిపోయాయి.. మళ్లీ సరిహద్దులను మూసేయాల్సి వచ్చింది.


దక్షిణ అమెరికాలోని ‘చిలీ’లో వైరస్‌ వేగంగా వ్యాపిస్తోంది. లాటిన్‌ అమెరికాలో అత్యంత సంపన్న దేశాల్లో ఇది కూడా ఒకటి. కానీ, ఇక్కడ ఆర్థిక అసమానతలు చాలా ఎక్కువగా ఉంటాయి. గతేడాది ఇక్కడ కొవిడ్‌ వేగంగా వ్యాపించింది. అప్పుడు కూడా ఈ దేశంలో లాక్‌డౌన్‌ విధించలేదు. కేవలం రాత్రి వేళల్లో కర్ఫ్యూ, మాస్క్‌ ధరించడం, నగరాల్లోనే తాత్కాలిక లాక్డౌన్‌లు విధిండం వంటివి చేసింది. గత సెప్టెంబర్‌ నుంచి పరిస్థితి కొంత అదుపులోకి వచ్చింది. నవంబర్‌లో పరిస్థితి బాగా అదుపులో ఉండటంతో పర్యాటకానికి అనుమతిచ్చింది. రెస్టారెంట్లు, షాపులు, హాలిడే రిసార్ట్‌లను తిరిగి ప్రారంభించారు. దీంతో జనవరి నుంచి మార్చి వరకు దేశంలో విపరీతంగా ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రజలు వెళ్లినట్లు వాషింగ్టన్‌ పోస్టు కథనంలో పేర్కొంది.

నిరుపయోగమైన ముందు చూపు..

సంపన్న దేశం కావడంతో టీకాలపై చాలా ముందు చూపుతో వ్యవహరించింది. వ్యాక్సిన్‌ తయారీదార్లతో ముందుగానే భారీ ఒప్పందాలు చేసుకొన్న దేశాల్లో చిలీ కూడా ఉంది. మార్చిలో తొలి కరోనా కేసు రాగా.. ఏప్రిల్‌ నుంచే వ్యాక్సిన్‌ కొనుగోలుకు ఏర్పాట్లు చేసింది. వ్యాక్సిన్‌ ప్రయోగాలు పూర్తయి మార్కెట్లోకి వచ్చిన వెంటనే టీకాలను అందిపుచ్చుకునేలా ఒప్పందాలు చేసుకొంది. వీటిలో చైనాకు చెందిన సినోవాక్‌ సంస్థ అభివృద్ధి చేసిన కరోనావాక్‌ను 1.4కోట్ల డోసులకు,  ఫైజర్‌-బయోఎన్‌టెక్‌తో కోటి డోసులకు, ఆస్ట్రాజెనెకా 40 లక్షలు, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ నుంచి 40 లక్షల డోసులకు ఒప్పందాలు చేసుకొంది. స్పుత్నిక్‌పై కూడా చర్చలు జరుపుతోంది. ఐరాస కోవాక్స్‌ ఉద్యమంలో కూడా ఉంది. అంటే.. కేవలం కొన్ని కంపెనీపైనే ఆధారపడకుండా.. విస్తృతంగా ఒప్పందాలు చేసుకొంది.  
డిసెంబర్లోనే టీకాలను ఇవ్వడం మొదలుపెట్టేసింది.  మార్చి 2021 నాటికి చైనా కంపెనీ కోటి డోసుల సరఫరాను పూర్తి చేసింది. 
తొలుత ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ఇచ్చేసింది. ఇక్కడి ప్రజలు కూడా వ్యాక్సిన్లు వేయించుకోవడానికి బాగా ఆసక్తి చూపారు. దీంతో యుద్ధప్రాతిపదికన టీకాలు వేశారు.  టీకాలు వేయించుకొన్న వారిలో ‘‘యోమివాక్‌నో’’ (నేను టీకా వేయించుకొన్నాను) అంటూ సోషల్ మీడియాలో ఫొటోలు షేర్‌ చేసే ఉద్యమాన్ని కూడా నడిపించింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక శాతం ప్రజలకు టీకాలు వేసిన దేశాల్లో చిలీ మూడో స్థానానికి చేరింది. 

కేసుల పెరుగుదలకు ముందే పునాది..

నవంబర్‌లో కేసులు తగ్గగానే ప్రజలు నిబంధనలను గాలికొదిలేయడం మొదలుపెట్టారు. క్రిస్మస్‌ సీజన్‌లో షాపింగ్‌ మాల్స్‌కు ఎగబడ్డారు. పర్యాటక స్థలాలు రద్దీగా మారాయి. విదేశీ యాత్రలకు వెళ్లిన వారు ఇతర కరోనా రకాలను అంటించుకొని దేశానికి తిరిగొచ్చారు.  ఫలితంగా జనవరి మొదటి నుంచి కేసుల  గ్రాఫ్‌ క్రమంగా  పెరుగుతూ వచ్చింది. పరీక్షలు చేయించుకోవడంలో కూడా నిర్లక్ష్యం వహించారు. ఫలితంగా దేశం మొత్తం వైరస్‌ పాకిపోయింది.

ఇక  చైనా నుంచి దిగుమతి చేసుకొన్న సినోవాక్‌ టీకా కరోనావాక్‌ మరో కారణంగా నిలిచింది. వాస్తవానికి టీకా అనుమతులకు 50శాతం సామర్థ్యం ఉంటే చాలు.. చిలీ వాడిన చైనా  టీకా సామర్థ్యం బ్రెజిల్‌లో జరిగిన ప్రయోగాల్లో బొటాబొటిగా 50శాతం దాటింది. అది కూడా రెండో డోసు వేయించుకొన్న రెండు వారాల తర్వాత కావడం గమనార్హం. ప్రపంచంలో ఆమోదం పొందిన టీకాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ సామర్థ్యం. ప్రజలకు దీనిపై అవగాహన లేదు.

చిలీలో దాదాపు 93శాతం చైనా టీకాలను వాడినట్లు బీబీసీ కథనంలో వెల్లడించింది.  మొత్తం టీకాలు వేయించుకొన్న వారిలో దాదాపు మూడో వంతు మంది మాత్రమే రెండో డోసును పూర్తి చేసుకొన్నారు.  గత శుక్రవారం కరోనావాక్‌పై చిలీ ప్రచురించిన పరిశోధనలో 85శాతం మంది ఆసుపత్రి పాలవ్వకుండా.. 89శాతం ఐసీయూ పాలవ్వకుండా ఈ టీకా పనిచేస్తోందని పేర్కొన్నట్లు వాషింగ్టన్ పోస్టు పత్రిక కథనంలో  పేర్కొంది. ఇక తొలి డోసుతో మాత్రం వైరస్‌ నుంచి అతి తక్కువ  రక్షణ లభిస్తున్నట్లు పేర్కొంది. దీంతో తొలి డోసు తీసుకొన్న వారు కొవిడ్‌ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే. కానీ అలా జరగకపోవడం వైరస్‌ వ్యాప్తికి కారణంగా మారింది.

‘చిలీ’ అంటే స్థానిక ఆదిమ జాతి మాపుచి భాషలో ‘భూమి అంతమయ్యే ప్రదేశమని’.. ఇప్పుడు అక్కడి ప్రభుత్వ, ప్రజల నిర్లక్ష్యంతో కరోనా వాక్సినేషన్‌పై ఆశలు అంతమయ్యే ప్రదేశంగా మారింది. దీని నుంచి భారత్‌ కూడా కచ్చితంగా పాఠం నేర్చుకుంటుందని ఆశిద్దాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని