ఆ చైనా మాజీ జనరల్‌కు కీలక పదవి

లద్దాక్‌లో భారత్‌పై కయ్యానికి కాలు దువ్విన చైనా మాజీ సైనిక జనరల్‌కు కీలక పదవి లభించింది. భారత్‌తో సరిహద్దుల్లో విధులు నిర్వహించిన జనర్‌ ఝావో ఝాంగ్‌కీని అత్యంత కీలకమైన నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌లో విదేశీ వ్యవహారాల

Published : 02 Mar 2021 01:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: లద్దాఖ్‌లో భారత్‌పై కయ్యానికి కాలు దువ్విన చైనా మాజీ సైనిక జనరల్‌కు కీలక పదవి లభించింది. భారత్‌తో సరిహద్దుల్లో విధులు నిర్వహించిన జనర్‌ ఝావో ఝాంగ్‌కీని అత్యంత కీలకమైన నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌లో విదేశీ వ్యవహారాల విభాగంలో డిప్యూటీ ఛైర్మన్‌గా నియమించింది. 65ఏళ్ల జనరల్‌ ఝావో చైనా వెస్ట్రన్‌ కమాండ్‌కు అధిపతిగా వ్యవహరించారు. ఆయన హయాంలోనే 2017లో డోక్లాం వద్ద, 2020లో లద్దాఖ్‌ వద్ద ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. తొలుత 2017లో డోక్లాం వద్ద పీఎల్‌ఏ రోడ్లు వేయడానికి ప్రయత్నించడంతో వివాదం చెలరేగింది. ఇది దాదాపు రెండు నెలలకు పైగా కొనసాగింది.  ఆ తర్వాత గత మే నెలలో లద్దాఖ్‌ వద్ద భారత్‌-చైనా సైనికులు ముఖాముఖీ తలపడ్డారు. అప్పటి నుంచి దాదాపు ఎనిమిది నెలలకు పైగా అక్కడ ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.  పీఎల్‌ఏలో అత్యుత్తమ జనరల్స్‌ పదవీవిరమణ వయస్సు 65 సంవత్సరాలు. దీంతో ఇటీవలే ఆయన పశ్చిమ కమాండ్‌ బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. తాజాగా ఝావో స్థానంలో జనరల్‌ ఝాంగ్‌ షుడాంగ్‌ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాతే పాంగాంగ్‌ వద్ద ఇరుదేశాలు సైనికులు వెనక్కు మళ్లారు. 

విదేశీ వ్యవహారాల విభాగానికి డిప్యూటీ ఛైర్మన్‌గా ఝావోను నియమిస్తూ నేడు పీపుల్స్‌ కాంగ్రెస్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. మార్చి 5 తేదీ నుంచి నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ వార్షిక సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ఝావో నియామకం చోటు చేసుకోవడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని