China: పాంగాంగ్‌ సరస్సులో చైనా వంతెన నిర్మాణం..!

కైలాస్‌ రేంజి పర్వత శిఖరాన్ని భారత్‌ ఆక్రమించుకొని పాంగాంగ్‌ సరస్సు వద్ద తన కొమ్ములు వంచడాన్ని చైనా ఇప్పటికీ జీర్ణించుకోలేదు. మరోసారి భారత్‌కు

Updated : 03 Jan 2022 16:57 IST

 ‘కైలాశ్‌ రేంజి’ వంటి షాకులు తగలకుండా ముందు జాగ్రత్త చర్యలు

ఇంటర్నెట్‌డెస్క్‌: కైలాస్‌ రేంజి పర్వత శిఖరాన్ని భారత్‌ ఆక్రమించుకొని పాంగాంగ్‌ సరస్సు వద్ద తన కొమ్ములు వంచడాన్ని చైనా ఇప్పటికీ జీర్ణించుకోలేదు. మరోసారి భారత్‌కు ఆ విధంగా దొరక్కుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంటోంది. సరస్సులో చైనా భూభాగం వైపు ఓ వంతన నిర్మాణం చేపట్టినట్లు ఆంగ్ల వార్తాపత్రికల్లో కథనం వెలువడింది. పాంగాంగ్‌ సరస్సులో చైనా ఆధీనంలోని ఖురాంక్‌ ప్రాంతంలో ఈ నిర్మాణం చేపట్టింది.  ఈ ప్రదేశం అత్యంత ఇరుగ్గా ఉంటుంది. రెడిమేడ్‌ నిర్మాణ సామగ్రితో ఈ పనులు చేపట్టింది.

ఖురాంక్‌ నుంచి సరస్సు దక్షిణ సరిహద్దుకు చేరుకొనేందుకు ఈ నిర్మాణం జరుగుతోంది. ఇది పూర్తయితే చైనా దళాలు 180 కిలోమీటర్లు చుట్టుతిరిగి రావాల్సిన అవసరం తప్పుతుంది. ఖురాంక్‌ నుంచి రుడాంక్‌కు దాదాపు 50 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ దూరం 200 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. దాదాపు 130 కిలోమీటర్లు పొడవున్న పాంగాంగ్‌ సరస్సులో కొంత భాగం టిబెట్‌లో ఉండగా.. మరికొంత భాగం లద్ధాక్‌  ప్రాంతంలో ఉంది.

భారత్‌ 2020 ఆగస్టులో కైలాశ్‌ రేంజిపై ఆపరేషన్‌ చేపట్టాక చైనా సైన్యం సత్వరమే స్పందించి ప్రతిఘటన ఇవ్వలేదు. ఫలితంగా భారత దళాలు అక్కడ స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించాయి.  చైనా దళాలు అక్కడకు చేరుకోవడానికి కనీసం 24 గంటలకు పైగా సమయం పట్టింది. ఈ నేపథ్యంలో చైనా అక్కడ భారత దళాలు నిర్వహించే ఆపరేషన్లను అడ్డుకోవడానికి వివిధ రకాల మార్గాలను అభివృద్ధి చేస్తోంది. 2021లో ఈ ప్రదేశంలో రహదారుల నిర్మాణం చేపట్టింది.

నిశ్శబ్దంగా శిఖరాల స్వాధనం

2020ఆగస్టు 29-30 అర్ధరాత్రి భారత్‌ కైలాశ్‌ రేంజి స్వాధనం ఆపరేషన్‌ మొదలైంది. వేర్వేరు ప్రదేశాల్లో ఉన్న దళాలు, ఆయుధాలు, ఇతర వనరులు ఒక దగ్గరకు చేరాయి. ఈ దళాలు మెరుపు వేగంతో కైలాస్‌ రేంజిగా పేరున్న పాంగాంగ్‌ సరస్సు దక్షిణ భాగంలోని శిఖరాలను స్వాధీనం చేసుకొన్నాయి. ఆగస్టు చివరి వరకు ఈ శిఖరాలు భారత్‌, చైనాల స్వాధీనంలో లేవు. వీటిల్లో రెచిన్‌ లా, రజాంగ్‌లా శిఖరాలు ఉన్నాయి. ఇవన్నీ స్పంగూర్‌ గ్యాప్‌ ప్రాంతంపై భారత్‌కు పట్టు పెంచాయి. చైనా స్థావరాలు ఉన్న మాల్డో గారిసన్‌పై ఈ శిఖరాల నుంచి గురిపెట్టవచ్చు. దీంతో చైనా ఆధిపత్యం ఒక్కసారిగా చేజారింది. దీంతో చైనా దృష్టి పాంగాంగ్‌ దక్షిణ శిఖరాలవైపు మళ్లిన సమయంలో పారా ఎస్‌ఎఫ్‌కు చెందిన ఓ చిన్న దళం ఫింగర్‌-4పై చైనా దళాల ఉన్న ప్రదేశం కంటే ఎత్తైన చోటుకు చేరుకుంది. అక్కడి నుంచి కింద ఉన్న చైనాపోస్టు స్పష్టంగా కనిపిస్తుంది. సెప్టెంబర్‌ మొదటి వారంలో ఈ విషయం బాహ్యప్రపంచానికి తెలిసింది. ఆ తర్వాత భారత్‌ ఆ శిఖరాలపైకి సాయుధ వాహనాలు, యుద్ధ ట్యాంకులను కూడా చేర్చడంతో చైనాపై ఒత్తిడి పెరిగింది.  చివరికి ఈ శిఖరం కోసం చైనా చేసేది లేక పాంగాంగ్‌ సరస్సు వద్ద దళాల ఉపసంహరణకు అంగీకరించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని