China: భారత్‌ సరిహద్దుల్లో భారీగా చైనా నిర్మాణాలు: చాథమ్‌ హౌస్‌

భారత్‌ సరిహద్దుల సమీపంలోని ఆక్సాయ్‌చిన్‌ వద్ద చైనా భారీ నిర్మాణాలు చేపట్టిందని యూకేకు చెందిన ఛాథమ్‌ హౌస్‌ తన నివేదకలో పేర్కొంది.  

Published : 05 Jun 2023 15:39 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌ సరిహద్దుల సమీపంలోని చైనా ఆక్రమిత ఆక్సాయ్‌చిన్‌లో పీఎల్‌ఏ(China) భారీగా నిర్మాణాలు చేపడుతోందని యూకేకు చెందిన ప్రముఖ థింక్‌ట్యాంక్‌ చాథమ్‌హౌస్‌ (రాయల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ అఫైర్స్‌) పేర్కొంది. పీఎల్‌ఏ సైనికులు మోహరించేందుకు వీలుగా సౌకర్యవంతమైన వాతావరణం చైనా సృష్టించిందని పేర్కొంది. రోడ్ల విస్తరణ, అవుట్‌పోస్టుల నిర్మాణం, క్యాంపుల ఏర్పాటు వంటి చర్యలు చేపడుతోంది. అక్టోబర్‌ 2022 నుంచి ఆరు నెలలపాటు వివిధ ఉపగ్రహ చిత్రాలు, 2020లో ఘర్షణ తర్వాత భారీ నిర్మాణాలకు సంబంధించిన ఇతర ఆధారాలను విశ్లేషించి ఈ నివేదికను తయారు చేసింది.

అక్సాయ్‌చిన్‌లో శాటిలైట్‌ చిత్రాల్లో విస్తరించిన రోడ్లు, అత్యాధునిక వెదర్‌ప్రూఫ్‌ క్యాంప్‌లు, అవుట్‌ పోస్టులు, పార్కింగ్‌ ప్రాంతాలు సోలార్‌ ప్యానల్స్‌, హెలిప్యాడ్‌లు ఉన్నట్లు ఛాథమ్‌ హౌస్‌ రిపోర్టులో వెల్లడించింది. వివాదాస్పద ప్రదేశంలో అక్సాయ్‌ చిన్‌ సరస్సు సమీపంలో సరికొత్త హెలిపోర్టు నిర్మిస్తున్నట్లు వెల్లడించింది. దీనిలో డ్రోన్లు, హెలికాప్టర్లు వాడుకొనే విధంగా 18 హ్యాంగర్లు, షార్ట్‌ రన్‌వే ఉన్నట్లు తెలిపింది. ఫలితంగా ఆక్సాయిచిన్‌ చుట్టుపక్కల పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ బలంగా కార్యకలాపాలు జరిపేందుకు వీలు లభిస్తుందని పేర్కొంది.  

2020లో సైనిక ఘర్షణ తర్వాత భారత్‌-చైనా సంబంధాలు 60 ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయికి కుంగాయి. దీంతోపాటు గల్వాన్‌ లోయ సమీపంలోని పీఎల్‌ఏ స్థావరాలను రోడ్లతో అనుసంధానం చేశారు. దీంతో ఇక్కడి నుంచి గడ్డకట్టిన నది మీదుగా గతంలో ఘర్షణ జరిగిన ప్రదేశాన్ని వీక్షించే పరిస్థితి నెలకొన్నట్లు ఛాథమ్‌ హౌస్‌ నివేదికలో వెల్లడించింది. మరోవైపు దెప్సాంగ్‌ మైదానాలు వంటి చోట్ల కూడా చైనా దళాల కదలికలు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. ఒక దెప్సాంగ్‌కు దక్షిణంపైపు ఉన్న ‘రకి నాలా’ వద్ద భారత దళాల గస్తీని అడ్డుకొనే పొజిషన్‌లో పీఎల్‌ఏ దళాలు ఉన్నట్లు వెల్లడించింది. దీంతోపాటు పలు అంశాలను విశ్లేషించింది. ఆక్సయ్‌చిన్‌ భారత్‌ ప్రాదేశిక భూభాగం అయితే 1962 యుద్ధంలో చైనా ఆక్రమించుకుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు