Published : 09/12/2021 01:47 IST

China: డ్రాగన్‌ డేంజర్ డిజైన్‌‌.. కంటైనర్ల ముసుగులో క్షిపణుల తరలింపు..! 

 రవాణా ఓడలను యద్ధనౌకలుగా వాడేందుకు చైనా యత్నాలు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

గ్రీకులు ‘ట్రోజన్‌ వార్‌’ గెలిచేందుకు ఓ భారీ చెక్క గుర్రాన్ని తయారీ చేసి దానిలో మెరికల్లాంటి సైనికులను ఉంచి తెలివిగా ప్రత్యర్థి నగరంలోకి ప్రవేశపెట్టారు.. అలా పంపిన సైనికుల ద్వారా ట్రాయ్‌ నగరాన్ని దొంగదెబ్బతీసినట్లు అక్కడి ఇతిహాసాలు చెబుతున్నాయి. చైనా ఇప్పుడు అలానే చేస్తోందని సైనిక నిపుణులు భయపడుతున్నారు. చైనాలో తయారయ్యే ఎలక్ట్రానిక్‌ వస్తువుల నుంచి చేపల వేట పడవల వరకూ ఏదో రకంగా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీకి ఉపయోగపడతాయి. తాజాగా సరకు రవాణా కంటైనర్లు కూడా ఈ జాబితాలో చేరాయి. ప్రత్యర్థులపై హఠాత్తుగా దాడి చేసేందుకు వీలుగా ముందుగానే ఆయుధాలను ఆయా దేశాల సమీపంలో మోహరించేందుకు వీటిని వాడే ప్రమాదం పొంచి ఉంది.

రవాణా నౌకలను తలపించేలా..!

సాధారణంగా సముద్ర మార్గంలో సరకు రవాణాకు షిప్పింగ్‌ కంటైనర్లను వాడతారు. ఈ కంటైనర్ల  సైజు  ఓ భారీ వాహనమంత ఉంటుంది. ఒక్కో రవాణా నౌకలో ఇవి కొన్ని వందలు ఉంటాయి. ఇప్పుడు చైనా వీటిల్లో క్రూయిజ్‌ క్షిపణి ప్రయోగ వ్యవస్థలను అమర్చి ప్రత్యర్థి దేశాల సమీపంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది. యుద్ధ సమయంలో హఠాత్తుగా వీటి నుంచి కెనస్టర్లు (క్షిపణులను ప్రయోగించే గొట్టాలు) బయటకు వచ్చి ప్రత్యర్థులపై దాడులు చేసేలా సిద్ధం చేస్తోంది. అంతేకాదు.. ఏ మాత్రం అనుమానం రాకుండా ప్రత్యర్థి యుద్ధనౌకలపై దాడి చేసి ముంచేసే అవకాశం ఉంది.

 

నిశ్శబ్దంగా శత్రువు ముంగిటికి..

కంటైనర్లను సాధారణంగా వాణిజ్య నౌకల్లో తరలిస్తారు. దీంతో ప్రత్యర్థి దేశాల నావికాదళాలు వీటిని పెద్దగా అనుమానించవు. దీనిని ఆసరాగా చేసుకొని కంటైనర్‌ క్షిపణి ప్రయోగ వ్యవస్థలను శత్రువుల ఓడ రేవుల్లోనే సరకుల కంటైనర్ల టెర్మనల్స్‌ మధ్యలోకి చేర్చవచ్చు. అవసరమైన సమయంలో వాటితో దాడులు చేయవచ్చని ఇంటర్నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ స్ట్రాటజీ సెంటర్‌కు చెందిన రిక్‌ ఫిషర్‌ అనే పరిశోధకుడు పేర్కొన్నాడు. ఆయన ‘స్టాక్టన్‌ సెంటర్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ లా’కు రాసిన పత్రంలో ఈ విషయాన్ని ప్రస్తావించాడు. కంటైనర్లను ఆయుధాలుగా మార్చే సామర్థ్యం చైనాకు ఉందని పేర్కొన్నారు.

ప్రత్యర్థుల తీరప్రాంత రక్షణ వ్యవస్థలపై ఒక్కసారిగా దాడి చేసి ధ్వంసం చేయడానికి ఈ కంటైనర్లు చాలా అనువుగా ఉంటాయి. వీటిలో వాడే క్రూయిజ్‌ క్షిపణులు అత్యంత తక్కువ ఎత్తులో ప్రయాణిస్తాయి. దీంతో వీటిని రాడార్లు వెంటనే గుర్తించలేవు. తీరప్రాంత రక్షణ వ్యవస్థలు ధ్వంసమైతే సముద్ర మార్గంలో ఆ దేశంపై దాడి చేయడం చైనాకు సులువుగా మారిపోతుంది. అంతేకాదు ఈ దాడి శత్రువును తీవ్ర గందరగోళానికి గురి చేస్తుంది.

ఉగ్రదాడి ముసుగులో..

చైనా వీటి రవాణాకు కంటైనర్‌ షిప్‌లు, వేలకొద్దీ చేపల వేట పడవలు వాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక యుద్ధ సమయంలో సైనిక దాడికి వీటిని వినియోగించొచ్చు. కానీ, కొన్ని సందర్భాల్లో చేతికి మట్టి అంటకుండా.. వీటి ద్వారా ప్రత్యర్థి దేశంపై దాడి చేసి.. అనంతరం దీనిని ఉగ్రవాదుల పనిగా చూపించి చేతులు దులుపుకొనే అవకాశం కూడా ఉంది. ప్రపంచంలోనే అత్యధిక సరకు రవాణా చేసే పోర్టుల్లో ఆరు రేవులు చైనాలో ఉండటం వీటి తరలింపునకు కలిసొచ్చే అంశంగా మారింది.

చాలా దేశాల వద్ద ఇలాంటి వ్యవస్థలు..

2016లో రష్యాకు చెందిన ఓ రక్షణ రంగ సంస్థ కంటైనర్లలో క్షిపణులు పెట్టే మోడల్‌ను ప్రదర్శించింది. క్యాలిబర్‌ క్షిపణులను ప్రయోగించేందుకు వీలుగా క్లబ్‌-కె పేరిట దీనిని అభివృద్ధి చేసింది. మొత్తం నాలుగు క్షిపణులను ఇది ప్రయోగించగలదు. దీంతోపాటే లాంఛ్‌ కంట్రోల్స్‌, టార్గెటింగ్‌ వ్యవస్థలు కూడా ఉంటాయి.

చైనా సంస్థ ఝుహై కూడా ఇటువంటి వ్యవస్థను 2016లోనే ప్రదర్శించింది. అది అభివృద్ధి చేస్తున్న కంటైనర్‌ క్షిపణి ప్రయోగ వ్యవస్థలో వైజే-18 క్షిపణులను ప్రయోగించే అవకాశం ఉంది.

ఇక ఇజ్రాయెల్‌ కూడా సొంతగా ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఎల్‌వోఆర్‌ఏ వ్యవస్థగా దీనిని వ్యవహరిస్తారు. 2017లోనే ఇజ్రాయెల్‌ ఏరోస్పేస్‌ సంస్థ పరీక్షించింది.

ఈ ఏడాది ఉత్తర కొరియా కూడా కంటైనర్‌ ప్రయోగ  వ్యవస్థను పరీక్షించింది. రైలుపై అమర్చిన కంటైనర్‌ నుంచి క్షిపణిని ప్రయోగించింది. 

సైనిక వాహన తయారీకి వీలుగా కార్‌ ఫెర్రీలు..!

చైనా నావికాదళ విన్యాసాల్లో సాధారణంగా వాణిజ్య నౌకలు కూడా పాల్గొంటాయి. 2020లో జులైలో జరిగిన ఓ విన్యాసాల్లో బ్యాంగ్‌ ఛూయి డావ్‌ అనే 15,560 టన్నుల బరువున్న ఫెర్రి పాల్గొంది. సైన్యం వినియోగించే జడ్‌టీ డీ-05 అనే యాంపీబియస్‌(భూమిపై, నీటిలో ప్రయాణించే) వాహనాలను తరలించేందుకు దీనిని వాడినట్లు ‘యుఎస్‌ఎన్‌ఐ న్యూస్‌’ ఈ ఏడాది జులైలో పేర్కొంది. సరకు రవాణా, ప్రయాణికులను తీసుకెళ్లే ఫెర్రీలను కూడా సైనిక అవసరాలకు అనుగుణంగా డిజైన్‌ చేయించింది.

ముందు చూపుతో..

సముద్రంలో పట్టు పెంచుకొనేందుకు చైనా చాలా ముందుచూపుతో వ్యవహరించింది. ఆ దేశంలో నౌకల తయారీ  పరిశ్రమలు పాటించాల్సిన ప్రమాణాలు, వాడాల్సిన డిజైన్లను పౌర, సైనిక అవసరాలకు అనుగుణంగా ముందుగానే నిర్ధారించింది. ఆయా సంస్థలు వాటిని అనుసరించాల్సిందే. అత్యవసర సమయాల్లో చైనా నావికాదళం ఆ నౌకలను సమీకరించి వాడుకోవడానికి వీలుగానే ఇలా చేసింది.

Read latest National - International News and Telugu News

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని