
మరోసారి బయటపడ్డ చైనా కుయుక్తులు!
హిందూ మహాసముద్రంలో డ్రోన్లు ప్రవేశపెట్టిన డ్రాగన్!
న్యూజెర్సీ: కొరకరాని కొయ్యగా మారిన భారత్‌పై పొరుగు దేశం చైనా కుయుక్తులు పన్నుతూనే ఉంది. పాంగాంగ్, గాల్వన్ సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తలెత్తక ముందు నుంచే భారత్ కదలికలపై చైనా కన్నేసినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. భారత నౌకాదళ కదలికలను, రహస్య వివరాలను సేకరించేందుకు గత డిసెంబరులోనే 14 అన్క్రూడెడ్ అండర్ వాటర్ వెహికల్స్ (యూయూవీ)లను హిందూమహా సముద్రంలో ప్రవేశపెట్టినట్లు హై సుట్టన్ అనే రక్షణ పరిశోధకుడు ఫోర్బ్స్ మేగజైన్లో రాసుకొచ్చారు. యూయూవీలు డ్రోన్ తరహాలో పని చేస్తాయి. సముద్ర అంతర్భాగంలో సంచరిస్తూ సంబంధిత సమాచారాన్ని చైనా సర్వర్లకు చేరవేస్తాయి.
గతంలో చైనా కదలికలను పసిగట్టేందుకు ఇటువంటి డ్రోన్లను అమెరికా వినియోగించింది. అయితే 2016లో చైనా వీటిని స్వాధీనం చేసుకుంది. 2019 డిసెంబర్లో చైనా ప్రవేశపెట్టిన 14 యూయూవీల్లో 12 మాత్రమే పని చేశాయని మొత్తం 3,400 వివరాలను పరిశీలించి చైనాకు చేరవేశాయని హై సుట్టన్ పేర్కొన్నారు. ఇవి సముద్రంలోని వివిధ శబ్దాలను, తరంగాలను పరిశీలిస్తాయి. అంతేకాకుండా భారత్ నేవీ వ్యవస్థకు సంబంధించిన రహస్య సమాచారాన్ని సేకరించేందుకే చైనా వీటిని వినియోగించిందని సుట్టన్ చెబుతున్నారు.
వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకేనా?
ఇండో పసిఫిక్ రీజియన్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు తగిన సమాచారాన్ని సేకరించేందుకే చైనా వీటిని ప్రవేశపెట్టి ఉండొచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇటీవల గ్లోబల్ డైలాగ్ సెక్యూరిటీ సమిట్ (జీడీఎస్ఎస్)లో భారత మహాదళపతి జనరల్ బిపిన్ రావత్ మాటలు దీనికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇండో ఫసిపిక్ రీజియన్‌లో ఉద్రిక్తతలు పెరిగిన తరుణంలో హిందూ మహాసముద్రంలో వ్యూహాత్మక స్థావరాలను ఏర్పాటు చేసుకునేందుకు ప్రపంచ దేశాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన అన్నారు. భారత్ కూడా అందుకు ఏం తీసిపోదని, భౌగోళికమైన ఈ వ్యూహాత్మక పోరులో అవసరమైన చోట్ల స్థావరాలు ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో ఇది మరింత ఊపందుకుంటుందని కూడా చెప్పారు. సైనిక రంగంలో సాంకేతికత వినియోగం ఆహ్వానించదగ్గ విషయమేనని, అయితే అది వినాశనానికి దారి తీసేలా ఉండకూడదని రావత్ అభిప్రాయపడ్డారు. భారత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా అన్ని రకాలుగా రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకుంటున్నట్లు తెలిపారు.
ఈ క్రమంలోనే భారత్ కంటే ముందే చైనా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. హిందూమహా సముద్రంలోకి డ్రోన్లను పంపించి పూర్తి సమాచారాన్ని సేకరించే పనిలో పడినట్లు సమాచారం. భారత్ నేవీ కదలికలు, రహస్యాలను పసిగట్టి తదనుగుణంగా ప్రణాళికలు వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.