చైనా నోట అర్ధసత్యం..!
ఎట్టకేలకు చైనా నిజాన్ని అంగీకరించింది. భారత్‌తో గత ఏడాది జూన్‌లో గల్వాన్‌లో లోయలో జరిగిన ఘర్షణలో తమ సైనికుల్ని కోల్పోయినట్లు అధికారికంగా ఒప్పుకొంది. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ) అధికారిక పత్రికలో శుక్రవారం ఈ విషయాన్ని ప్రచురించారు.......
గల్వాన్‌లో సైనికుల్ని కోల్పోయినట్లు అధికారిక ప్రకటన
దిల్లీ: ఎట్టకేలకు చైనా నిజాన్ని కొంతవరకు అంగీకరించింది. భారత్‌తో గత ఏడాది గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో తమ సైనికుల్ని కోల్పోయినట్లు అధికారికంగా ఒప్పుకొంది. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ) అధికారిక పత్రికలో శుక్రవారం ఈ విషయాన్ని ప్రచురించింది. ఇంతకాలం ఈ అంశాన్ని అధికారికంగా ఒప్పుకోకపోయినప్పటికీ.. చైనా వైపు నష్టం తీవ్ర స్థాయిలోనే ఉందని బయటి ప్రపంచానికి అప్పట్లోనే అర్థమైంది.
‘‘కారకోరమ్ పర్వత ప్రాంతంలో మోహరించిన మొత్తం ఐదుగురు ఫ్రంట్‌లైన్ ఆఫీసర్లు, సైనికులు భారత్‌తో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయారు. వారి త్యాగాల్ని సెంట్రల్ మిలిటరీ కమిషన్(సీఎంసీ) గుర్తించింది’’ అని పీఎల్‌ఏ డైలీ అనే అధికారిక పత్రిక రాసుకొచ్చింది. చనిపోయిన వారిలో షింజియాంగ్ మిలిటరీ కమాండ్‌కు చెందిన రెజిమెంటల్ కమాండర్ కీ ఫబో ఉన్నట్లు పేర్కొంది. ఫబోకు ఆ దేశ అత్యున్నత సైనిక పురస్కారాల్లో ఒకటైన ‘హీరో రెజిమెంటల్ కమాండర్ ఫర్ డిఫెండింగ్ ది బోర్డర్’తో సీఎంసీ గౌరవించినట్లు తెలిపింది. మిగిలిన నలుగురిని ‘హీరో టు డిఫెండ్ ది బోర్డర్’ పురస్కారంతో గౌరవించినట్లు వెల్లడించింది. పీఎల్‌ఏకి సీఎంసీ సుప్రీం అథారిటీగా వ్యవహరిస్తుంది. దీనికి షీ జిన్‌పింగ్ నేతృత్వం వహిస్తారు. పురస్కారాలు పొందిన ఐదుగురు పేర్లను మాత్రమే పీఎల్‌ఏడైలీ వెల్లడించింది. మొత్తం మృతుల సంఖ్య ఇదే అని మాత్రం చెప్పకపోవడం గమనార్హం.
మన వీరుల్ని ఘనంగా గౌరవించుకున్నాం..
గల్వాన్ ఘర్షణలో ఇరువైపుల భారీ స్థాయిలోనే ప్రాణనష్టం జరిగింది. సరిహద్దుల్లో చైనా దురాక్రమణను అడ్డుకునే క్రమంలో తెలుగు తేజం కర్నల్ సంతోష్ బాబు సహా మరో 19 మంది సైనికులు వీరమరణం పొందారు. భారత సైనికులు దేశ రక్షణలో ప్రాణాలర్పించారని కేంద్ర ప్రభుత్వం అప్పట్లోనే అధికారికంగా ప్రకటించింది. వారి అంత్యక్రియల్ని సైనిక లాంఛనాలతో జరిపింది. వారి కుటుంబాల్ని ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చాయి. 16వ బిహార్ రెజిమెంట్‌లో విధులు నిర్వర్తించిన సంతోష్‌బాబుకు ప్రతిష్ఠాత్మక మహావీర్ చక్ర పురస్కారాన్ని ప్రకటించింది. ఆర్మీలో ‘పరమ్‌వీర్ చక్ర’ తర్వాత ఇదే రెండో అత్యున్నత స్థాయి పురస్కారం కావడం విశేషం. మరో ఐదుగురు గల్వాన్ యోధులను ‘వీర్ చక్ర’తో గౌరవించింది. అలాగే జాతీయ యుద్ధ స్మారకంపై చిరస్థాయిగా నిలిచిపోయేలా అమరులైన 20 మంది భారత సైనికుల పేర్లను చిహ్నంపై చెక్కారు. మరోవైపు గల్వాన్ వీరులను స్మరించుకుంటూ భారత సైన్యం ఇప్పటికే తూర్పు లద్దాఖ్‌లోని ‘పోస్ట్ 120’ వద్ద ‘గ్యాలంట్స్ ఆఫ్ గల్వాన్’ పేరుతో ఒక స్మారకాన్ని నిర్మించింది. చైనా సైనికులను ఆ ప్రాంతం నుంచి తొలగించడానికి సంతోష్ బాబు నేతృత్వంలోని బృందం సాగించిన పోరాటం గురించి దానిపై లిఖించారు.
సానుభూతి కోసమే తాజా ప్రకటన..
కానీ, చైనా మాత్రం ప్రత్యర్థి దేశంతో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన వారి సైనికుల సమాచారాన్ని కప్పిపెడుతూ వచ్చింది. కనీసం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయడానికి కూడా ఒప్పుకోలేదు. ఒకరకంగా చెప్పాలంటే వారి మరణానికి గుర్తింపే ఇవ్వలేదు. కానీ, చైనా దురాక్రమణపూరిత వైఖరిపై అంతర్జాతీయ సమాజం ఇటీవల తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. అగ్రరాజ్యం అమెరికా అనేకసార్లు డ్రాగన్‌ను హెచ్చరించింది. దీంతో ‘మేమూ సైనికుల్ని కోల్పోయాం’ అని చెప్పుకొని సానుభూతి పొందడం కోసం నెలల తర్వాత గల్వాన్‌లో తమ సైనికులు మరణించిన విషయాన్ని అంగీకరించింది. వారికి పురస్కారాలనూ ప్రకటించింది. అయితే, ప్రాణనష్టం విషయంలో చైనా అబద్దాలాడుతోందని వచ్చిన ఆరోపణల్ని తోసిపుచ్చడానికీ చైనా తాజా ప్రకటనకు ఓ కారణమై ఉంటుంది భావిస్తున్నారు.
ఆరోజు ఏం జరిగిందంటే..
గత ఏడాది జూన్ 15న తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌లో ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. లోయలోని పెట్రోలింగ్ పాయింట్-14 వద్ద చైనా సైన్యం.. ద్వైపాక్షిక నిబంధనలకు తిలోదకాలిస్తూ ఒక నిఘా శిబిరాన్ని ఏర్పాటు చేసింది. దీన్ని అడ్డుకున్న భారత సైనికులపై వారు.. ఇనుప కడ్డీలు, ఫెన్సింగ్ తీగ చుట్టిన కర్రలు, పదునైన మేకులతో కూడిన కట్టెలతో దాడికి దిగారు. సంతోష్ నేతృత్వంలోని మన సేన దీన్ని గట్టిగా తిప్పికొట్టింది. ఈ ప్రతిఘటనలో చైనా సైన్యానికి చెందిన 35 మంది సైనికులు హతమైనట్లు అమెరికా నిఘావర్గం, 45 మంది చనిపోయినట్లు రష్యా పత్రిక టాస్ పేర్కొన్నాయి. తాజాగా నాటి ప్రాణనష్టాన్ని అధికారికంగా అంగీకరించిన చైనా అధికారులు, సైనికులు కలిపి మొత్తం ఐదుగురు చనిపోయినట్లు పేర్కొంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
SC: పెళ్లి చేసుకుంటానని అత్యాచారం.. జాతకం కుదరలేదని మోసం!
-
General News
Hyderabad: ఇంటి గోడ కూలి ముగ్గురి చిన్నారులకు గాయాలు
-
Crime News
UP: 42 ఏళ్ల క్రితం 10 హత్యలు.. 90 ఏళ్ల వృద్ధుడికి జీవిత ఖైదు!
-
General News
TSPSC: ప్రశ్నపత్రాల లీకేజీ కేసు.. పోలీసు కస్టడీకి విద్యుత్‌శాఖ డీఈ రమేశ్
-
Sports News
Sehwag: ఆ ఓటమి బాధతో రెండు రోజులు హోటల్ రూమ్ నుంచి బయటికి రాలేదు: వీరేంద్ర సెహ్వాగ్
-
Crime News
Andhra News: పింఛను తీసుకునేందుకు వచ్చి.. ఒడిశా రైలు ప్రమాదంలో సిక్కోలు వాసి మృతి