భారత్‌-పాక్‌ స్నేహ హస్తం మాకు ‘సంతోషం’: చైనా

గత కొంతకాలంగా భారత్‌-పాకిస్థాన్‌ మధ్య చోటుచేసుకుంటున్న సానుకూల పరిణామాలు మాకెంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయని చైనా అభిప్రాయపడింది.

Updated : 29 Mar 2021 19:05 IST

బీజింగ్‌: గత కొంతకాలంగా భారత్‌-పాకిస్థాన్‌ మధ్య చోటుచేసుకుంటున్న సానుకూల పరిణామాలు తమకెంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయని చైనా పేర్కొంది. అంతేకాకుండా ప్రాంతీయ శాంతి, సుస్థిరత, అభివృద్ధిలో తోడ్పాటును అందించేందుకు పాకిస్థాన్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది.

‘పాకిస్థాన్‌, భారత్‌ మధ్య కొంతకాలంగా జరుగుతోన్న పరస్పర భేటీలపై మేం సంతోషంగా ఉన్నాం’ అని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్‌ పేర్కొన్నారు. ఈ సమయంలో ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, అభివృద్ధి విషయంలో మరింత సానుకూల శక్తిని అందించడానికి పాకిస్థాన్‌తో కలిసి పనిచేయాలని అనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాకుండా చైనా తమకు అత్యంత మిత్రదేశమంటూ పాకిస్థాన్‌ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు ఝావో లిజియన్‌ పేర్కొన్నారు. ఈ సమయంలో కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా వ్యాక్సిన్‌తో పాటు ఇతర అంశాల్లోనూ పాకిస్థాన్‌కు తమ సహకారాన్ని అందించడంతో పాటు ఇరుదేశాల మధ్య ఎన్నో ఏళ్లుగా ఉన్న స్నేహాబంధాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నట్లు ఆయన‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

గతాన్ని మరిచి ఇరు దేశాల మధ్య శాంతి సామరస్యం కోసం ముందుకెళ్దామంటూ పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌, పాక్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ కమర్‌ జావేద్‌ బజ్వాలు భారత్‌కు స్నేహహస్తం అందించిన విషయం తెలిసిందే. దీంతో జమ్మూకశ్మీర్‌తో పాటు అన్ని సెక్టార్లలో నియంత్రణ రేఖ వెంట కాల్పుల విమరణ ఒప్పందాలకు కట్టుబడి ఉందామంటూ భారత్‌, పాకిస్థాన్‌ దేశాల సైన్యాధికారులు ఈమధ్యే ఓ అవగాహనకు వచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని