China: 100 కోట్ల డోసులను పంపిణీ చేసిందట!

చైనాలో ఇప్పటివరకు 100కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసినట్లు అక్కడి ఆరోగ్య విభాగం వెల్లడించింది.

Updated : 20 Jun 2021 16:05 IST

చైనా ఆరోగ్యవిభాగం వెల్లడి

బీజింగ్‌: యావత్‌ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్‌కు కారణమైన చైనాలో వ్యాక్సిన్‌ పంపిణీ వేగంగా సాగుతోంది. ఇప్పటివరకు  100కోట్ల వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసినట్లు వెల్లడించింది. వ్యాక్సిన్‌ తయారీ నుంచి పంపిణీ వరకు గోప్యత పాటిస్తోన్న చైనా, తాజాగా 100 కోట్ల మార్కును దాటినట్లు ప్రకటించింది. మొత్తం జనాభాలో ఎంతశాతం మందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు..? ఒకటి, రెండు డోసులకు సంబంధించిన వివరాలపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.

అంతర్జాతీయ నివేదికల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 180 దేశాల్లో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు దాదాపు 260కోట్ల డోసులను పంపిణీ చేశారు. వీటిలో చైనా అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఈయూ, అమెరికా, భారత్‌ దేశాలు వ్యాక్సిన్‌ పంపిణీలో ముందున్నాయి. తాజాగా చైనా 100కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు అక్కడి ఆరోగ్య విభాగం నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ ప్రకటించింది. అయితే, చైనాలో ఇప్పటివరకు ఎంతశాతం ప్రజలకు వ్యాక్సిన్‌ ఇచ్చారనే విషయంపై స్పష్టతనివ్వలేదు. కానీ, 140కోట్ల జనాభా కలిగిన చైనా, ఈ నెల చివరినాటికి మొత్తం జనాభాలో 40శాతం మందికి రెండు డోసులను అందించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు తెలిపింది.

టీకాల పనితీరు ఎలాగంటే..?

చైనాలో ఇప్పటికే నాలుగు కరోనా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నట్లు సమాచారం. వీటిలో బ్రెజిల్‌లో జరిపిన ప్రయోగాల్లో చైనా సినోవాక్‌ టీకా కేవలం 50శాతం సమర్థత చూపించినట్లు తెలిసింది. ఇక సినోఫార్మ్‌ అభివృద్ధి చేసిన రెండు టీకాల్లో ఒకటి 79శాతం, మరొకటి 72శాతం సమర్థత చూపించినట్లు వెల్లడైంది. మరో టీకా కాన్‌సినో తయారు చేసిన టీకా సమర్థత 65శాతం మాత్రమేనని తేలింది. ఈ టీకాలన్నీ రెండు డోసుల్లో తీసుకునేవే.

టీకా తీసుకుంటే ప్రోత్సాహకాలు..

దేశంలో కరోనా వైరస్‌ ప్రభావం తగ్గడం, చైనా వ్యాక్సిన్‌ల పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో టీకా తీసుకునేందుకు అక్కడి ప్రజలు నిరాసక్తి చూపిస్తున్నారనే వార్తలు వచ్చాయి. ఇలాంటి వారిని ప్రోత్సహించేందుకు స్థానిక ప్రావిన్సులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అన్‌హువాయ్‌ ప్రావిన్సులో వ్యాక్సిన్‌ తీసుకుంటే ఉచితంగా కోడిగుడ్లు ఇస్తుండగా, బీజింగ్‌ వంటి ప్రాంతాల్లో షాపింగ్‌ కూపన్లను అందజేస్తున్నారు. ఇక దేశంలో వ్యాక్సిన్‌ పంపిణీ చేయడంతోపాటు విదేశాలకు ఎగుమతి చేసేందుకు చైనా ఇతర దేశాలతోనూ ఒప్పందాలు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది దాదాపు 300కోట్ల డోసులను తయారు చేయనున్నట్లు చైనా అధికారిక వార్తా సంస్థ వెల్లడించింది.

ఇదిలాఉంటే, అంతర్జాతీయ గణాంకాల ప్రకారం.. కరోనా టీకా పంపిణీలో 100కోట్ల డోసులతో చైనా అగ్రస్థానంలో ఉండగా, యురోపియన్‌ యూనియన్‌లో 32 కోట్ల డోసులను పంపిణీ చేశారు. ఇక అమెరికాలో 31.7కోట్ల డోసులను పంపిణీ చేయగా, భారత్‌లో 27.6కోట్ల కరోనా డోసులను అందించారు. బ్రెజిల్‌లో 8.6 కోట్లు, బ్రిటన్‌లో 7.3కోట్ల డోసులను ఇప్పటివరకు అందించినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని