ఎట్టకేలకు కోవాక్స్‌లో చేరిన చైనా!

కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసి అన్ని దేశాలకు సమానంగా అందించడమే లక్ష్యంగా ఏర్పాటైన కోవాక్స్‌ కూటమిలో చేరేందుకు చైనా కూడా సిద్ధమైంది. ఈ మేరకు శుక్రవారం ఆ దేశ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ప్రకటన చేశారు..........

Updated : 09 Oct 2020 10:56 IST

బీజింగ్‌: కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసి అన్ని దేశాలకు సమానంగా అందించడమే లక్ష్యంగా ఏర్పాటైన కోవాక్స్‌ కూటమిలో చేరేందుకు చైనా కూడా సిద్ధమైంది. ఈ మేరకు శుక్రవారం ఆ దేశ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ప్రకటన చేశారు. తొలుత ఈ కూటమిలో చేరేందుకు డ్రాగన్‌ నిరాకరించిన విషయం తెలిసిందే. అందరికీ సమానంగా వ్యాక్సిన్‌ అందాలన్న లక్ష్యంతోనే కోవాక్స్‌లో చేరుతున్నట్లు చైనా తెలిపింది. వ్యాక్సిన్‌ అభివృద్ధి చేసే సామర్థ్యం ఉన్న ప్రతి దేశం దీనిలో చేరాలని పిలుపునిచ్చింది. అయితే, ఈ కూటమిలో చైనా సహకారం ఎలా ఉండనుందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ప్రపంచ మానవాళి సంక్షేమం కోసమే చైనా వ్యాక్సిన్‌ తయారుచేస్తోందని గతంలో ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చైనాలో మూడు రకాల కరోనా వ్యాక్సిన్లు క్లినికల్‌ ట్రయల్స్‌ మూడో దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో చైనా.. కూటమిలో చేరడం గమనార్హం. 

వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన దేశాల నుంచి దాన్ని కొనుగోలు చేసి, ప్రపంచవ్యాప్తంగా పారదర్శకంగా సరఫరా చేయాలన్న లక్ష్యంతో కోవాక్స్‌ ఏర్పాటైంది. అమెరికా మాత్రం దీనిలో చేరేందుకు విముఖత వ్యక్తం చేసింది. ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికాలోని అల్పాదాయ దేశాలు సైతం వేగంగా, పారదర్శకంగా, అందరితో సమానంగా కొవిడ్ టీకాను పొందేందుకు ఈ కూటమి కృషి చేస్తోంది. 2020 చివరికల్లా 200 కోట్ల డాలర్లు సమీకరించాలని దీనిలో చేరిన దేశాలు లక్ష్యంగా పెట్టుకొన్నాయి. దీని ద్వారా వ్యాక్సిన్ పరిశోధనలు, అభివృద్ధి, తయారీ, పంపిణీ సామర్థ్యం పెంచేందుకు ఆర్థిక సాయం అందనుంది. ఇప్పటికే అభివృద్ధి దశలో ఉన్న అనేక టీకా ప్రాజెక్టులను కోవాక్స్‌ పరిధిలోకి తీసుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని