చైనా నగరాల్లో లాక్‌డౌన్‌..!

కరోనా వైరస్‌ మహమ్మారికి పుట్టినిళ్లైన చైనాలో పాజిటివ్‌ కేసులు బయటపడుతూనే ఉన్నాయి. దీంతో పలుప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Published : 07 Jan 2021 20:20 IST

పలు ప్రావిన్సుల్లో పెరుగుతోన్న కరోనా కేసులు

బీజింగ్‌: కరోనా వైరస్‌ మహమ్మారికి పుట్టినిల్లైన చైనాలో పాజిటివ్‌ కేసులు బయటపడుతూనే ఉన్నాయి. దీంతో పలుప్రాంతాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఉత్తర చైనాలోని హెబీ ప్రావిన్సులో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో దాదాపు ఏడున్నర కోట్ల జనాభా కలిగిన హెబీ ప్రావిన్సులో లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించారు.

వైరస్‌ను సమర్థవంతంగా కట్టడి చేశామని చైనా చెబుతున్నప్పటికీ దేశవ్యాప్తంగా నిత్యం పదుల సంఖ్యలో కరోనా కేసులు బయటపడుతూనే ఉన్నాయి. కేవలం గురువారం ఒక్కరోజే 63కేసులు బయటపడినట్లు చైనా నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ వెల్లడించింది. వీటిలో 52కేసులు స్థానికంగా వ్యాప్తిచెందినవే కాగా, మరో 11కేసులు బయట ప్రాంతాలనుంచి వచ్చిన వారిలో గుర్తించినట్లు పేర్కొంది. కేవలం హెబీ ప్రావిన్సులో గత నాలుగు రోజుల్లోనే వీటి సంఖ్య 90కి చేరిందని  ఆరోగ్యశాఖ తెలిపింది. ముఖ్యంగా ఈ ప్రావిన్సుకు ప్రధాన కేంద్రమైన షిజియాజువాంగ్‌లో వైరస్‌ తీవ్రత పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఇతర ప్రాంతాలనుంచి ఈ ప్రావిన్సుకు రైలు, విమాన సర్వీసుల రాకపోకలను నిలిపివేశారు. అంతేకాకుండా, సమీప గ్రామాలు, పట్టణ ప్రాంతాలలో వైరస్‌ వ్యాప్తి నియంత్రణ చర్యలను కఠినంగా అమలు చేస్తున్నారు. పాఠశాల తరగతులను రద్దు చేశారు. వచ్చే ఏడాది జరిగే వింటర్‌ ఒలింపిక్స్‌ కోసం ఇక్కడ ఏర్పాట్లు కొనసాగుతున్న సమయంలోనే వైరస్‌ తీవ్రత మరింత పెరిగింది.

ఇక షిజియాజువాంగ్‌తో పాటు షేన్‌యాంగ్‌, లయోనింగ్‌ ప్రావిన్సులోని దాలియన్‌ నగరాల్లోనూ వైరస్‌ వ్యాప్తిని నివారణకు గట్టి చర్యలు చేపడుతున్నారు. వచ్చే నెల కొత్త సంవత్సర వేడుకలకు చైనా సిద్ధమవుతున్న సమయంలో కరోనా వైరస్ మరో దఫా విజృంభిస్తుందనే ఆందోళన అక్కడి అధికారుల్లో నెలకొంది. దీంతో కొత్త సంవత్సర వేడుకలను తగ్గించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. చైనా అధికారిక లెక్కల ప్రకారం, ఇప్పటివరకు అక్కడ 87,278 కేసులు బయటపడగా, 4634 మంది మృత్యువాతపడ్డారు.

ఇదిలాఉంటే, చైనాలో ప్రయోగదశలో ఉన్న కరోనా వ్యాక్సిన్ల‌ను అత్యవసర వినియోగం కింద జులై నుంచే పంపిణీ మొదలుపెట్టింది. గతకొన్ని రోజులుగా వ్యాక్సిన్‌ పంపిణీ వేగం పెంచిందని, జనవరి ఒకటో తేదీ నాటికే దాదాపు 45లక్షల మందికి టీకా ఇచ్చినట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే, వాటి సమర్థతపై ప్రపంచ దేశాల్లో అనుమానాలు వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే.

ఇవీ చదవండి..
చైనా టీకాలు.. పనిచేస్తాయా?
డబ్ల్యూహెచ్‌వో ఆందోళన నిజమైంది!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని