China: చైనాలో మళ్లీ లాక్‌డౌన్‌.. 40లక్షల జనాభా ఉన్న నగరం మూసివేత

యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి పుట్టినిల్లు చైనాలో మళ్లీ వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. గత కొద్ది రోజులుగా కేసుల సంఖ్య ఎక్కువవుతుండటంతో

Updated : 26 Oct 2021 16:16 IST

బీజింగ్‌: యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి వ్యాప్తి చైనాలో మళ్లీ పెరుగుతోంది. గత కొద్ది రోజులుగా కేసుల సంఖ్య ఎక్కువవుతుండటంతో అప్రమత్తమైన డ్రాగన్‌.. మరోసారి ఆంక్షల బాట పట్టింది. ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యగా పలు ప్రాంతాల్లో స్కూళ్లు, పర్యాటక ప్రదేశాలను మూసివేసిన చైనా.. తాజాగా 40లక్షల జనాభా కలిగిన లాన్‌జువో నగరంలో లాక్‌డౌన్‌ విధించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని గట్టిగా చెప్పింది.  

చైనాలో గత కొద్ది రోజులుగా డెల్టా వేరియంట్‌ విజృంభణ కొనసాగుతోంది. ఓ వృద్ధ జంట షాంఘై నుంచి పలు ప్రావిన్సుల్లో పర్యటించింది. వారిలో కొవిడ్‌ లక్షణాలు కన్పించడంతో అధికారులు వారి కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ చేపట్టారు. అనంతరం వారితో సన్నిహితంగా మెలిగిన వారిని పరీక్షించగా.. డజన్ల కొద్దీ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే 100కు పైగా కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో ఉలిక్కిపడిన చైనా ఆంక్షలు తీసుకొస్తోంది. రానున్న రోజుల్లో వైరస్‌ నిర్ధారణ పరీక్షలు పెంచుతున్నామని, దీంతో కొత్త కేసులు మరింత పెరిగే అవకాశముందని ఆరోగ్య సిబ్బంది చెబుతున్నారు. 

ఇదిలాఉంటే, కరోనా వైరస్‌ పోరులో భాగంగా చాలా దేశాలు వ్యాక్సిన్‌ను విస్తృతంగా పంపిణీ చేయడంతో పాటు వైరస్‌తో కలిసి జీవించే వ్యూహాలను రచిస్తున్నాయి. కానీ, చైనా మాత్రం పాజిటివ్‌ కేసులను సున్నాకు తీసుకురావడంతోనే మహమ్మారికి అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది. ఇదే లక్ష్యంతో జీరో-కొవిడ్‌ (Zero Covid) వ్యూహాన్ని అనుసరిస్తోంది. దీంతో ఒక్క కేసు నమోదైనా ఆ ప్రాంత సరిహద్దులను మూసివేసి లక్షల సంఖ్యలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేపడుతోంది. మరోపక్క చైనాలో వ్యాక్సిన్‌ పంపిణీ కూడా శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 200కోట్లకుపైగా డోసులను పంపిణీ చేసినట్లు సమాచారం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని