China - US: ఏదో ఒకరోజు అమెరికాపై చైనా అణుదాడి..!

అగ్రరాజ్యం అమెరికా, చైనా మధ్య వివాదం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్నాయి. వాణిజ్య ఒప్పందం, దక్షిణ చైనా సముద్రం, కరోనా మహమ్మారి.. ఇలా చాలా అంశాలపై ఇరు దేశాలు చాలా సార్లు బహిరంగంగానే మాటల

Published : 20 Nov 2021 01:10 IST

హెచ్చరించిన అమెరికా మిలిటరీ ఉన్నతాధికారి

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా, చైనా మధ్య వివాదం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్నాయి. వాణిజ్య ఒప్పందం, దక్షిణ చైనా సముద్రం, కరోనా మహమ్మారి.. ఇలా చాలా అంశాలపై ఇరు దేశాలు చాలా సార్లు బహిరంగంగానే మాటల యుద్ధానికి దిగాయి. అంతేనా.. అత్యవసర పరిస్థితుల్లో అమెరికాను ఎదుర్కొనేందుకు డ్రాగన్‌ తన అస్త్రశస్త్రాలను కూడా సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగానే కొన్ని నెలల కిందట ఓ రహస్య క్షిపణి ప్రయోగాన్ని కూడా చేపట్టింది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే అమెరికాపై చైనా దాడికి సిద్ధమవుతుందేమోనన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. తాజాగా అగ్రరాజ్య మిలిటరీ ఉన్నతాధికారి ఒకరు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏదో ఒక రోజు అమెరికాపై డ్రాగన్‌ అనూహ్య అణు దాడి జరపొచ్చని హెచ్చరించారు.

ఈ ఏడాది జులైలో చైనా అణ్వస్త్ర సామర్థ్యమున్న ఒక సరికొత్త హైపర్‌సోనిక్‌ క్షిపణిని పరీక్షించింది. అది.. దిగువ భూ కక్ష్యలో పయనిస్తూ పుడమి మొత్తాన్ని చుట్టేసింది. ఆ తర్వాత కిందకి దిగి, శరవేగంగా లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. ఇది కొద్దిలో గురితప్పినా.. ప్రమాదకరమైన క్షిపణి రూపకల్పనలో డ్రాగన్‌ చాలా వరకూ పట్టు సాధించినట్లు తేటతెల్లమైంది. అయితే అత్యంత గోప్యంగా జరిపిన ఈ ప్రయోగం ఇటీవల బయటపడింది. దీనిపై అమెరికా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ వైస్‌ ఛైర్మన్‌ జనరల్‌ జానీ హేటెన్‌ మరిన్ని వివరాలను సేకరించారు. 

‘‘గత ఐదేళ్లలో చైనా వందలాది హైపర్‌సోనిక్‌ క్షిపణి పరీక్షలు నిర్వహించింది. అమెరికా మాత్రం కేవలం 9 ప్రయోగాలే చేపట్టింది. ఇప్పటికే చైనా వద్ద మీడియం రేంజ్‌ హైపర్‌సోనిక్‌ ఆయుధం ఉంది. జులైలో ప్రయోగించిన క్షిపణి లాంగ్‌ రేంజ్‌ మిసైల్‌. వందలాది క్షిపణులను తయారు చేసుకుంటున్న చైనా.. ఏదో ఒక రోజు అమెరికాపై అనూహ్య అణ్వాయుధ దాడి జరిపే అవకాశం ఉంది’’ అని హేటెన్‌ హెచ్చరించారు. ఇటీవల పెంటగాన్‌ కూడా ఇదే విషయాన్ని పేర్కొంది. డ్రాగన్‌ తన అణ్వాయుధ సామర్థ్యాన్ని శరవేగంగా పెంచుకుంటోందని, ఈ దశాబ్దం చివరి నాటికి ఆ దేశం వద్ద 1000 న్లూక్లియర్‌ వార్‌హెడ్‌లు ఉండొచ్చని అంచనా వేసింది. 

ధ్వనితో పోలిస్తే కనీసం ఐదు రెట్లు వేగం (గంటకు 6,200 కిలోమీటర్లు)గా దూసుకెళ్లే అస్త్రాలను హైపర్‌సోనిక్‌ క్షిపణులుగా పేర్కొంటారు. ఇలాంటి క్షిపణినే చైనా ఇటీవల ప్రయోగించింది. భూమి చుట్టూ ఓ క్షిపణి ప్రయాణించడం ఇదే తొలిసారి. అయితే ఈ ప్రయోగాన్ని ధ్రువీకరించిన చైనా.. అది క్షిపణి కాదని, వ్యోమనౌక అని వెల్లడించడం గమనార్హం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని